RRR నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్: పవర్‌ఫుల్ గెటప్‌లో దర్శనమిచ్చిన స్టార్ హీరో
భారతదేశ సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). 'బాహుబలి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఊహించని విధంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది.
నేడు (ఏప్రిల్ 2) అజయ్ దేవగణ్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని RRRలో ఆయన పాత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో ఆయనకు అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చాడు రాజమౌళి. తెల్లదొరలు చుట్టుముట్టి ఆయనపై కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉండగా.. వాళ్లకు ఎదురొడ్డే పోరాట యోధుడిలా అజయ్ దేవగణ్ కనిపిస్తున్నాడు. ఆయుధాలతో ఒంటి నిండా దెబ్బలతో ఉన్నాడాయన. అలాగే, ఇందులో కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సూపర్‌గా ఉంది. దీంతో ఈ మోషన్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. 1920లో కనిపించకుండా పోయిన అల్లూరి, కొమరం భీంలను కలిపడంతో పాటు అన్ని విద్యలు నేర్పే గురువుగా ఆయన నటిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్నీ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, రామ్ చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. వీళ్లతో పాటు ఆలియా భట్, ఒలీవియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ సహా ఎందరో ఉన్నారు.


Click it and Unblock the Notifications











