అజిత్‌కు తీవ్ర విషాదం.. స్వయంగా ఓదార్చిన దళపతి విజయ్, త్రిష!
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆయన తల్లి మోహిన మణి శనివారం ఉదయం స్వర్గస్తులయ్యారు. తల్లి మరణంతో అజిత్ దిగ్బ్రాంతికి గురయ్యారు. తన తల్లి మరణ వార్త తెలిసిన సమయంలో ఆయన చెన్నైకి దూరంగా విదేశాల్లో ఉన్నారు. ఈ దుర్వార్త తెలుసుకోగానే వెంటనే ఆయన చెన్నైకి చేరుకొన్నారు. అయితే మాతృవియోగంతో బాధపడుతున్న తన సహచర నటుడు, మిత్రుడు అజిత్‌ను పరామర్శించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి విజయ్, ఆయన శ్రేయోభిలాషి త్రిష కృష్ణన్ స్వయంగా వచ్చారు. తనను ఓదార్చేందుకు వచ్చిన ఆ ఇద్దరిని అజిత్ కౌగిలించుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అజిత్ తల్లి మరణం గురించిన వార్త వివరాల్లోకి వెళితే..
అజిత్ తల్లి మోహిని మణి వయసు 89 సంవత్సరాలు. గత కొద్దికాలంగా ఆమె వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా తీవ్ర అస్శస్థతకు గురి కావడంతో ఆమెను చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యంతో పోరాడుతూ ఆమె శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దాంతో అజిత్ కుటుంబంలోను, ఆయన అభిమానుల్లోను తీవ్ర విషాదం నెలకొన్నది.

అజిత్ తల్లి మరణ వార్తను ఆయన సోదరుడు అనిల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. మా తల్లిగారు మోహిని మణి 1937 జన్మించారు. 2026 మే 30వ తేదీన మరణించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తన నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. మా తల్లిగారు సుదీర్ఘమైన జీవితాన్ని ఆస్వాదించారు. ఇలాంటి విషాద సమయంలో కూడా ఆమె తన జీవితాన్ని గడిపిన విధానం చూసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. దాదాపు 6 దశాబ్దాల వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. మా తండ్రి మరణం తర్వాత ఆయన మెమొరీస్‌తోనే జీవితాన్ని వెల్లదీశారు అని తన ప్రకటనలో తెలిపారు.
అజిత్‌కు మాతృవియోగం సంభవించిందనే వార్తతో తమిళ, దక్షిణాది సినీ వర్గాలు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాయి. కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ఇతర సినీ నటులు ఆయనకు సంతాప సందేశాన్ని అందించారు. మోహిని మణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఇదిలా ఉండగా, సాయంత్రం అజిత్ కుమార్ చెన్నైకి చేరుకొన్న తర్వాత విజయ్, త్రిషా కృష్ణన్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. విజయ్, త్రిష రాకను తెలుసుకొన్న అజిత్ ఇంటి ప్రాంగణంలోకి వచ్చి వారిని కలుసుకొన్నారు. పుట్టుడు దు:ఖంలో ఉన్న అజిత్‌ను విజయ్, త్రిష కౌగిలించుకొని ఓదార్చారు. ఆ తర్వాత అజిత్ తల్లి పార్థీవ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. అయితే విజయ్, అజిత్ ఫ్యాన్స్‌లో వార్ కొనసాగుతుంటుంది. కానీ కష్టకాలంలో తన మిత్రుడు అజిత్‌ను విజయ్ ఓదార్చడంతో ఇరు హీరోల ఫ్యాన్స్ కూడా రియలైజ్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications