బోయపాటి శ్రీనును వెంటాడుతున్న అఖండ 2 డిజాస్టర్.. నష్టాలు చెల్లించాలని డిస్టిబ్యూటర్ల డిమాండ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. అఖండ సినిమా సాధించిన విజయం తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ ప్రేక్షకుల అంచనాలు చేరుకోకపోవడంతో తొలి ఆట నుంచే ప్రతికూల పరిస్థితుల్లోకి జారుకొన్నది. రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడం, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు భారీ మొత్తాన్ని చెల్లించి ప్రదర్శన హక్కులు సొంతం చేసుకోవడం తెలిసింది. అయితే ఏపీ, తెలంగాణలోని ఏరియా వారీగా రిలీజ్ చేసిన పంపిణీదారులు తాజాగా తమకు ఎదురైన నష్టాలు పూడ్చుకొనేందుకు తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీనును కలిసి తమ ఆందోళనను వ్యక్తం చేశారని తెలిసింది. ఈ వివాదం గురించిన వివరాల్లోకి వెళితే..
అఖండ 2 చిత్రం ఆంధ్ర, నైజాంలో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసుకొన్నది. నైజాం హక్కులు 20 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 20 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కర్ణాటక, హిందీ, ఇతర రాష్ట్రాల హక్కులు కలిపి 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 12.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 103 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు ఈ సినిమా 104 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

అయితే నైజాంలో ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. నష్టాల భారీగా లేకపోయినా.. అక్కడిక్కడికి సరిపోయింది. నైజాంలో సుమారుగా 20 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక సీడెడ్‌లో 20 కోట్లకు గాను 12 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఆంధ్రాలో 26 కోట్లు మాత్రమే సాధించింది. దాంతో 14 కోట్ల రూపాయలు ఇంకా రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ సినిమాకు ప్రదర్శన హక్కులకు భారీగా చెల్లించి నష్టపోయిన పంపిణీదారులు తాజాగా దర్శకుడు బోయపాటిని కలిసి తమ పరిస్థితిని, గోడును వివరించారు. ఆంధ్రా ప్రదేశ్‌లో సుమారుగా 50 శాతం మేర నష్టపోయాం. నష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలి. లేకపోతే మా పరిస్థితి దారుణంగా ఉంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి డిమాండ్లను, రిక్వెస్టులను విన్న ఆయన.. జీఎస్టీ రూపంలో చెల్లించిన మొత్తాన్ని వెంటనే తిరిగి ఇచ్చేస్తాం అని హామీ ఇచ్చినట్టు సమాచారం.
అయితే ఈ సినిమాకు బోయపాటి రికార్డుస్థాయి రెమ్యునరేషన్‌ను తీసుకోన్నారు. ఈ సినిమాకు బాలకృష్ణ కూతురు స్వయంగా సహ నిర్మాతగా ఉన్నారు. దాంతో ఈ సినిమా నిర్మాత, దర్శకుల నుంచి బయ్యర్లు నష్టాలను రాబట్టే విధంగా చర్యలు తీసుకొంటున్నారు. నిర్మాతలపై ఒత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగా వారు ఇటీవల బోయపాటిని కలిశారు అనే విషయం ట్రేడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతున్నది.
వరుస సక్సెస్‌లతో ఉన్న బోయపాటి శ్రీనుకు వినయ విధేయ రామ, స్కంధ మూవీ తర్వాత బాక్సాఫీస్ వద్ద అఖండ 2 రెండో అతిపెద్ద ఫెయిల్యూర్. తన సినిమాల కథ, కథనాలను పేలవంగా డిజైన్ చేస్తున్నారు. నేల విడిచి సాము చేయడం వల్లే హీరోలకు, బయ్యర్లకు తీరని నష్టాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదే కొనసాగితే ఇండస్ట్రీలో ఆయన సక్సెస్ క్రెడిబిలిటికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











