అఖండ 2 ప్రీమియర్స్ రద్దు.. బాలయ్య మూవీకి ఎదురు దెబ్బకు కారణం అదేనా?
నందమూరి బాలకృష్ణ అభిమానులకు గట్టి షాక్ తగిలింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 4వ తేదీ ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అనూహ్యంగా అఖండ 2 ప్రీమియర్స్ క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రకటించింది. దీంతో నందమూరి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అఖండ 2 చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అఖండ 2 మూవీ టికెట్ ధరల పెంపునకు, ప్రీమియర్స్ షో ప్రదర్శించుకోవడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. సింగిల్ స్క్రీన్‌లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు (జీఎస్టీతో కలిపి) పెంచుకోవచ్చు. రోజుకు ఐదు షోలతో పాటు దాదాపు 10 రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి. అలాగే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షో ప్రదర్శించడానికి కూడా ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
అయితే తెలంగాణలో మాత్రం టికెట్ ధరల పెంపు విషయమై చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. అనేక తర్జన భర్జనలు, కసరత్తు అనంతరం ఎట్టకేలకు డిసెంబర్ 4వ తేదీన అఖండ 2 మూవీ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే డిసెంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కేవలం 3 రోజులు మాత్రమే పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్‌లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు (జీఎస్టీతో కలిపి) పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అలాగే డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షో ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనికి టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించింది.
అన్ని రకాల అడ్డంకులను దాటుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్‌లలో అఖండ 2 మూవీ ప్రీమియర్స్‌ను ప్రదర్శించడానికి చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసింది. సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. బాలయ్యను తెరపై ఎప్పుడెప్పుడు చూసుకుందామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా.. ప్రీమియర్స్ రద్దు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో టెక్నికల్ కారణాలతో ఈ ప్రీమియర్స్ రద్దు అయ్యాయి. అయితే ఓవర్సీస్‌లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ పడతాయని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications











