Akhanda 2 Thaandavam Trailer Review: ధర్మం జోలికొస్తే.. సర్జికల్ స్టైక్సే, అంచనాలు పెంచేసిన అఖండ 2 ట్రైలర్
సింహా, లెజెండ్, అఖండల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం అఖండ 2. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుస విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న బాలయ్య .. మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. డిసెంబర్ 5న అఖండ 2ను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా అఖండ 2 ట్రైలర్‌ను విడుదల చేశారు. మరి అఖండ 2 తాండవం ట్రైలర్ ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? లేదా? అన్నది పరిశీలిస్తే..
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే పాట విడుదల చేయగా.. తాజాగా నవంబర్ 21న అఖండ 2 ట్రైలర్‌ను విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో జరిగిన ఈ కార్యక్రమానికి కరునాడ చక్రవర్తి, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇక అఖండ 2 ట్రైలర్ విషయానికి వస్తే.. దాదాపు 2.41 నిమిషాల నిడివితో ఉన్న ఈ తాండవం ట్రైలర్‌లో బాలయ్య విశ్వరూపం ప్రదర్శించారు. ముందుగా ఓ గుహ లాంటి ప్లేస్‌లో తలుపులు ఓపెన్ అయి కష్టమొస్తే దేవుడొస్తాడు అని నమ్మే జనానికి, కష్టమొచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్లు నమ్మినరోజు భారతదేశం తునాతునకలైపోతుందనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
ఆ తర్వాత కుంభమేళా గురించి చెబుతుండగా విలన్ పాత్రలో ఆది పినిశెట్టిని రివీల్ చేస్తారు. 8 కంఠాలు తెగాలి, రక్తం చిందాలి అని ఆది చెబుతాడు. ఆ వెంటనే సాఫ్ట్ క్యారెక్టర్‌లో ఉన్న బాలయ్యని చూపిస్తారు. ఏదో ఒక రోజున వాడొచ్చి కొరివిపెడితేనే.. ఈ కట్టె మట్టెలో కలిసిపోతుందని ఓ పెద్దావిడ చెబుతుండగా ఫ్యామిలీ అంతా కన్నీరు పెడతారు. అనంతరం మంచు కొండల్లో ఓ యువతిని కొందరు వెంటాడుతుండగా అఖండ ఎంట్రీ చూపిస్తారు.
ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా నీకు అక్కడ కనిపించేది మతం.. ఈ దేశంలో ఎటు చూసినా నీకు కనిపించేది ధర్మం.. సనాతన హైందవ ధర్మం అని బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతాడు. దేశం జోలికొస్తే మీరు దండిస్తారు.. దైవం జోలికొస్తే మేము ఖండిస్తాం.. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్స్ అంటూ మిషన్ గన్‌ని త్రిశూలంతో ఆపరేట్ చేస్తూ బాలయ్య విశ్వరూపం చూపించాడు. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న దేశం రూపాన్ని మాత్రమే చూసుంటావు.. ఎప్పుడూ మా దేశం విశ్వరూపాన్ని చూసుండవు.. మేం ఒకసారి లేచి శబ్ధం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్ధం అంటూ బాలయ్య ఇచ్చిన ఫినిషింగ్ టచ్ చూస్తుంటే హైందవ ధర్మం, దేశభక్తి, దుష్టశక్తిపై యుద్ధం అనే ఎలిమెంట్స్ చుట్టూ అఖండ 2ని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.
ఈ ట్రైలర్‌లో మురళీ కృష్ణగా, అఖండగా బాలయ్య ఎప్పటిలాగే తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ చేయగా.. ఆది పినిశెట్టి మాంత్రికుడిగా భయపెడుతున్నాడు. సంయుక్త మీనన్ అందంతో కట్టిపడేసింది. నందమూరి ఆస్థాన సంగీత దర్శకుడు థమన్.. తన బీజీఎం, ట్రేడ్ మార్క్ బీట్లతో సునామీ సృష్టించాడు. మరి అఖండ 2 తాండవం తెరపై ఎలా ఉందో చూడాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











