నాగార్జున ‘ఘోస్ట్’లో మరో తెలుగు హీరో: బంగార్రాజులో అతడు.. ఇందులో మాత్రం ఇతడు
అప్పట్లో వరుస విజయాలను అందుకున్నా.. కొంత కాలంగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. అయినప్పటికీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, విజయం మాత్రం ఆయనకు అందనంత దూరంలోనే ఉంటోంది. దీంతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆరంభంలో 'వైల్డ్ డాగ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా... ప్రతికూల పరిస్థితుల కారణంగా కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. దీంతో ఇదీ కూడా ఆయనకు నిరాశనే మిగిల్చింది.
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోయే అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం పలు చిత్రాలను చేస్తున్నాడు. అందులో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో ఆయన 'ఘోస్ట్' అనే సినిమాను మొదలు పెట్టాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఇది పున: ప్రారంభం అయింది. దీంతో ఆ అనుమానాలకు పుల్‌స్టాప్ పడిపోయింది. నాగార్జున కాల్షీట్లను బట్టి ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఘోస్ట్' మూవీ నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాలో అక్కినేని నట వారసుడు అఖిల్ ఓ అతిథి పాత్రను పోషిస్తున్నాడట. కొద్ది సేపు మాత్రమే ఉన్నప్పటికీ ఈ పాత్ర సినిమాలో ఎంతో ముఖ్యమైన సమయంలో వస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూట్ కూడా త్వరలోనే జరగబోతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. త్వరలోనే అతడు 'ఏజెంట్' మూవీ షూట్ కోసం ఫారెన్ వెళ్లబోతున్నాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 'ఘోస్ట్' కోసం సెట్స్‌కు రాబోతున్నాడని సమాచారం.
క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో అక్కినేని నాగార్జున ఊహించని పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకున్నట్లు ఈ మధ్యనే ఓ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇక, నాగార్జున ప్రస్తుతం 'బంగార్రాజు' అనే సినిమాలోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయక'కు ఇది ప్రీమేక్‌గా రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చైతూతో కలిసి నటిస్తోన్న నాగ్.. 'ఘోస్ట్'లో అఖిల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











