గోవిందా.. గోవిందా అంటున్న అఖిల్.. శ్రీవారిపై భారం వేసి..
అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అఖిల్‌కు గత మూడు చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయాయి. అఖిల్, హాల్లో, మిస్టర్ మజ్ను సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. అయితే మరో ప్రయత్నంగా తన సత్తాను చాటుకొనేందుకు అఖిల్ అక్కినేని సిద్ధమయ్యాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ క్రమంలోనే సినిమా ప్రారంభానికి ముందు అఖిల్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

తిరుమలను నేను పవిత్ర ప్రదేశంగా భావిస్తాను. అక్కడ నాకు ప్రశాంతత, మానసిక స్థైర్యం లభిస్తుంది. కలియుగ వైకుంఠస్వామిని దర్శించుకొనేందుకు కాలి నడకన బయలు దేరాను. నా ప్రతీ సినిమాకు పాటించినట్టుగానే శ్రీవారిని దర్శించుకొన్నాను. శ్రీవారి దర్శనం తర్వాత నా కొత్త సినిమా ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నాను. పూర్తిస్థాయిలో నా మనసు, హృదయాన్ని సినిమాపై లగ్నం చేస్తాను. గోవిందా.. గోవిందా అంటూ అఖిల్ ట్వీట్ చేశారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మొదలయ్యే సినిమాలో నటీనటులు, సాంకేతిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ పేర్కొన్నది. బొమ్మరిల్లు తర్వాత భాస్కర్ విజయం కోసం, అలాగే మూడు సినిమాల తర్వాత భారీ సక్సెస్ కోసం పరితపిస్తున్న అఖిల్.. ఈ సినిమాపై కన్నేశారు. వీరికి తోడుగా అల్లు అరవింద్ జత కలిశాడు. అయితే ఈ చిత్రంలో అఖిల్ తండ్రిగా ప్రముఖ దర్శకుడు సముద్రఖని నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు.


Click it and Unblock the Notifications











