Sushanth: పెళ్లి గోలపై క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో.. నేనైతే అలా చేయను.. అప్పుడే పెళ్లి అంటూ..
సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో కొంతమంది యువ హీరోలు 30 దాటితే గాని పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక మరికొందరు పెళ్లి చేసుకున్న కొంతకాలానికే విడాకులు ఇచ్చేస్తున్నారు. ఈ తరహా సంఘటనలు అయితే ఎక్కువగా అక్కినేని ఫ్యామిలీలో చోటుచేసుకున్నాయి అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ ఫ్యామిలీలో ఇంకా పెళ్లి సైడ్ ఆలోచించని హీరోలలో సుశాంత్ మాత్రమే ఉన్నాడు. ఇక అతను కూడా ఇటీవల తన పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అక్కినేని ఫ్యామిలీలో..
అక్కినేని కుటుంబంలో రెండవ తరం నుంచి చూసుకుంటే అక్కినేని నాగార్జున నుంచి కూడా పెళ్లి విషయాలు అనేవి ఊహించని మలుపులు తిరుగుతూ వస్తున్నాయి. నాగార్జున మొదట దగ్గుపాటి వారి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అనంతరం శివ సినిమా హీరోయిన్ అమలను ఆయన ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు.

మూడవ తరంలో..
ఇక అక్కినేని ఫ్యామిలీలో మూడవ తరం కూడా పెళ్లికి సంబంధించిన వ్యవహారాలతో ఊహించని చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అక్కినేని నాగచైతన్య అలాగే అక్కినేని అఖిల్ ఇద్దరు కూడా ఒకేసారి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం వేడుక అనంతరం పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి బ్రేకప్ చెప్పేసాడు. ఇక నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకున్న కొంతకాలానికి విడాకులు ఇచ్చాడు.

గొడవలు లేకుండా
ఇక అక్కినేని నాగార్జున పెద్ద మేనల్లుడు సుమంత్ కూడా అదే తరహాలో చెదు అనుభవాలను చూశాడు. అతను తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి దాంపత్యం కూడా రెండేళ్లకే ముగిసింది. ఇక అక్కినేని హీరోలు విడాకులు తీసుకున్నప్పటికీ పెద్దగా గొడవలు లేకుండా వారి భాగస్వామ్యులతో ఫ్రెండ్లీగానే విడిపోయారు.

సుశాంత్ ఈ విధంగా..
అయితే అక్కినేని ఫ్యామిలీలో ఇంకా పెళ్లి వైపు ఆలోచించని మరో హీరో కూడా ఉన్నాడు. అతనే సుశాంత్. వయసు కూడా మూడు పదులు దాటేసింది. చాలా ఏళ్ల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ అనుకున్నంతగా కెరీర్ ను నిలబెట్టుకోలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా అతనికి బాక్సాఫీస్ వద్దనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ మధ్య చిలాసౌ అనే సినిమాతో మాత్రం పరవాలేదు అనిపించాడు.

స్టార్స్ సినిమాలలో..
ప్రస్తుతం సుశాంత్ స్టార్స్ సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే అల వైకుంఠపురములో.. సినిమాలో నటించిన అతను ఇప్పుడు రవితేజ రావణాసుర సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే భోళా శంకర్ సినిమాలో కూడా లవర్ బాయ్ పాత్ర పోషించబోతున్నాడు. ఈ క్రమంలో రావణాసుర ప్రమోషన్ లో సుశాంత్ తన పెళ్లి విషయం గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

పెళ్లి విషయంలో.. అలా చేయను
పెళ్లి మీద నాకు ఒక క్లారిటీ ఉంది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందరూ డిస్టర్బ్ అవుతారు అని ఏమీ లేదు. నేను ప్రస్తుతం ఉన్న దానికంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉంటాను అని అనిపిస్తేనే.. పెళ్లి చేసుకుంటాను. అంతే తప్ప వయసు వచ్చింది కదా అని పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ విధంగా అయితే చేయను అని సుశాంత్ వివరణ ఇచ్చాడు.

పెళ్లి ఎప్పుడంటే..
ఇక పెళ్లి ఎప్పుడు ఉండవచ్చు అనే విషయంలో కూడా అతను వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పట్లో అయితే నా పూర్తి ఫోకస్ సినిమా కెరిర్ పైనే ఉంది అని దానికి ఇంకా టైమ్ పడుతుంది ఏమో అని అనుకుంటున్నాను అని అన్నాడు. అంతే కాకుండా ఆ విషయం గురించి కూడా పెద్దగా ఆలోచించలేదు అన్నట్లుగానే సుశాంత్ తెలియజేశాడు. ఇక ప్రస్తుతం రెండు మూడు కథలు చర్చల్లో ఉన్నాయని త్వరలోనే మళ్లీ హీరోగా సినిమా చేస్తానని కూడా ఈ హీరో వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











