అక్కినేని కాంపౌండ్‌లోకి ‘ఉప్పెన’ డైరెక్టర్: రొమాంటిక్ డ్రామాను రెడీ చేయిస్తోన్న నాగ్
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. చిన్న వయసులోనే 'సిసింద్రీ' అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న అతడు.. హీరోగా మారిన తర్వాత మాత్రం ఒక్కటంటే ఒక్క విజయాన్నీ అందుకోలేకపోయాడు. హీరోగా పరిచయం అయిన 'అఖిల్'తో పాటు 'హలో', 'మిస్టర్ మజ్నూ' నిరాశనే మిగిల్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే మూవీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాగార్జున.. అఖిల్ కోసం అదిరిపోయే కాంబోను సెట్ చేస్తున్నాడట.
సుకుమార్ దగ్గర చాలా ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి.. మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్‌తో 'ఉప్పెన' అనే సినిమాను రూపొందించిన బుచ్చిబాబుతో అక్కినేని అఖిల్ ప్రాజెక్టు ఉండబోతుందట. మొదటి సినిమాతోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్న ఈ దర్శకుడితో నాగార్జున ఇప్పటికే చర్చలు జరిపాడని తెలుస్తోంది. అంతేకాదు, తన కుమారుడు అఖిల్ కోసం రొమాంటిక్ డ్రామాను సైతం రెడీ చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జునే స్వయంగా నిర్మించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీని తర్వాత ఈ అక్కినేని హీరో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయబోతున్నాడు. ఇందుకోసం సరైనా మేకోవర్ సాధించాలని జిమ్‌లో కసరత్తులు కూడా చేస్తున్నాడు. అలాగే, పలు విభాగాల్లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఇక, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే అక్కినేని అఖిల్ - బుచ్చిబాబు సన సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ లోపు స్క్రిప్టు వర్క్ పూర్తి చేయాలని ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భావిస్తున్నాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











