ఇంటికి పిలిచి అవమానాలు... 23 రోజులు కొనఊపిరితో నా కోసమే.. తారకరత్న భార్య ఎమోషనల్
నందమూరి తారకరత్న మరణించి మూడేళ్లు కావొస్తుంది అంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఇష్టపడి, పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్య, పిల్లలు తారకరత్న మరణంతో దిక్కులేని వాళ్లు అయ్యారు. భర్త జ్ఞాపకాలు, ఆయనతో గడిపిన క్షణాలను తలచుకుంటూ కుమిలిపోతున్నారు అలేఖ్య. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు తారకరత్నతో పరిచయం, పెళ్లి, కుటుంబంతో విభేదాలు, హార్ట్ అటాక్ వచ్చిన రోజు ఏం జరిగింది? తారకరత్న మరణం తర్వాత జీవితం ఎలా సాగుతోంది అనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
జనవరి 27, 2023 నా జీవితాన్ని తలకిందులు చేసిన రోజు. ఉదయాన్నే మాతో మాట్లాడేసి యువగళం పాదయాత్రకు బయల్దేరుతున్నట్లు చెప్పారు. ఆ రోజు సాయంత్రమే ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. ప్రతి శుక్ర, శనివారాలలో పిల్లలతో కలిసి సినిమాలు చూస్తారు. 100 శాతం నేను ఇంటికి వచ్చేస్తున్నానని ఉదయం 8.40కి మాట్లాడిన మనిషి 11 గంటల కల్లా ఏం జరిగిందో తెలియలేదు. మొదట మా అమ్మగారు కాల్ చేశారు. డీ హైడ్రేషన్ అయ్యిందని తారక్‌ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. అయితే రెండోసారి మా అమ్మ మళ్లీ కాల్ చేసి అర్జెంట్‌గా బాల బాబాయ్ (బాలకృష్ణ)కి ఫోన్ చేస్తావా? లేదా? అని అరిచింది. దాంతో బాల బాబాయ్‌కి ఫోన్ చేస్తే కూడా డీ హైడ్రేషన్ అయినట్లుగా ఉంది.. మేం ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని కంగారుపడొద్దని చెప్పారు. ఇదే విషయాన్ని అమ్మకి కూడా చెప్పానని అలేఖ్య తెలిపారు.

ఆ తర్వాత చిన్నాన్న విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి మా అమ్మాయిని తీసుకుని కుప్పం వెళ్లమని చెప్పారు. స్కూల్ నుంచి నిష్కమ్మని పికప్ చేసుకునేందుకు కారులో వెళ్తుండగా బాబుగారు ఫోన్ చేసి కుప్పంకు వెళ్తున్నావా అని అడిగారు. ఆయన కాల్ చేసిన తర్వాత పరిస్ధితి ఆందోళనకరంగా ఉందని నాకు అర్ధమైంది. యువగళంలో బాబుగారు ఎంత బిజీగా ఉంటారో తెలుసు కదా. ఈలోపు డాక్టర్ నుంచి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ మాటలకు ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాక కుప్పకూలిపోయి గట్టిగా ఏడ్చేశా. ఫైనల్ డెసిషన్ నీదేనని డాక్టర్ చెప్పారు. కుప్పంకి తీసుకెళ్లినా, బెంగళూరు తీసుకెళ్లినా రిస్కే అని అన్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించడమే బెటర్ అని మా అన్నయ్య చెప్పారు. తారక్‌ని అలా చూసి తట్టుకోలేకపోయా.. నా బ్రెయిన్ కూడా పనిచేయలేదు. నా కోసమే 23 రోజులు హాస్పిటల్ బెడ్ మీద పోరాడారు. ఆ క్లిష్టపరిస్ధితుల్లో నా తల్లిదండ్రులు, చిన్నాన్న, బాల బాబాయ్ తోడుగా నిలిచారు. కొద్దిరోజుల తర్వాత మా ఫ్యామిలీని వెళ్లిపోమని చెప్పా.. ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేస్తానని అందరినీ పంపించేశానని అలేఖ్య గుర్తుచేసుకున్నారు.
ఒక దశలో తారకరత్నని ఇంటికి తీసుకెళ్లిపోతానని.. నలుగురు పిల్లలు అనుకని నేనే చూసుకుంటాను, ఆసుపత్రిలో కూడా పట్టదలచుకోలేదు. దీనికి ఒక ఎంఆర్ఐ అనేది చాలా ఇంపార్టెంట్. తారక్ చుట్టూ డాక్టర్స్ అంతా నిలబడి ఎంఆర్ఐ తీశారు. ఆ రిపోర్ట్ తీసుకుని ఆంజనేయస్వామి గుడిలోనే ఉన్నా.. నేరుగా డాక్టర్ సంజయ్ గారి దగ్గరికి వెళ్లగా ఆయన నోటి వెంట సారీ అన్న మాట వినిపించింది. ఆ వెంటనే బాల బాబాయ్‌కి, చిన్నాన్నకి, అమ్మనాన్నలకు కాల్ చేసి చెప్పా. చివరి శ్వాస వరకు నేను తారక్ పక్కనే ఉన్నా. మా అన్నయ్య, చెల్లెలు మొత్తం ఫ్యామిలీని చూసుకున్నారు. పిల్లల్ని చెల్లెలు అస్సలు వదల్లేదు. అమ్మనాన్నలకి తారక్ బాగా క్లోజ్.. విషయం తెలిసి వారిద్దరూ కుప్పకూలిపోయారు. పిల్లల్ని చూసి ఇంకా ఎక్కువ ఏడుస్తున్నారు. 7, 8 నెలల పాటు ఆ షాక్‌లో నుంచి నేను తేరుకోలేకపోయా.. తిరగని గుడిలేదు, మాకెందుకు ఇలా జరగాలని బాధపడుతూనే ఉన్నా అని అలేఖ్య పేర్కొన్నారు.
ఎంత డబ్బున్నా.. ఫ్యామిలీ, రిలేషన్స్, ఎమోషన్ అనేది కొనలేం. నా ఫ్యామిలీ ఎప్పుడూ చాలా స్ట్రాంగ్. తారక్ సైడ్ ఫ్యామిలీ కూడా నా పిల్లలకు తోడుగా ఉండాలని అనుకుంటున్నా. నాకున్న దానిలో పిల్లల్ని బాగానే పెంచగలుగుతాను. నా భర్త లేరు అనే దానిలో నుంచి మేం బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ సడెన్‌గా చేయి పట్టుకుని నువ్వు కుంకుమ పెట్టుకోకు, నువ్వు హారతి ఇవ్వకు అని ఆపేసినప్పుడు గుండె పగిలిపోతుంది. ఆరోజు ఎలా ఏడ్చానో.. అంతకుమించి ఏడ్చాను. మా ఇంట్లో వాళ్లు ఎవరూ అలాంటి తేడాలు చూపించలేదు. అప్పటి నుంచి ఎవరి ఇంట్లో పూజలు జరుగుతున్నా వెళ్లను... ఒకసారి జరిగింది, ఆ పెయిన్‌ను మళ్లీ మళ్లీ తీసుకోలేను. ఇవన్నీ పట్టించుకోవద్దని అమ్మానాన్న, చిన్నాన్న ఓదార్చారు. అవమానించడానికి అసలు నన్నెందుకు పిలవాలి? నాకు పెళ్లి కాకముందు అదే దేవుడు, పెళ్లయిన తర్వాత అదే దేవుడు.. ఇప్పుడు కూడా అదే దేవుడు. అలాంటప్పుడు నన్ను ఎలా అడ్డుకుంటారు. వితంతువులు ఇలాగే ఉండాలని రూల్ బుక్ ఏమైనా ఉందా? అని అలేఖ్య ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications

















