Naa Saami Ranga: నాగార్జున ఫ్రెండ్ అంజి వచ్చేశాడు.. మాటొచ్చేత్తది అంటూ కొత్తగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో అసలు ఫలితాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. చాలా కాలం పాటు వేగంగా సినిమాలు చేసిన ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా స్లో అయ్యాడు. దీంతో ఇప్పుడు మళ్లీ స్పీడు పెంచాలని ఈ సీనియర్ స్టార్ హీరో డిసైడ్ అయిపోయాడు.
సరైన హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న కింగ్ నాగార్జున ఇప్పుడు 'నా సామిరంగ' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఆరంభంలోనే భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

'నా సామిరంగ' మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను జరుపుతున్నారు. ఎలాగైనా వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. అదే సమయంలో ప్రచార చిత్రాలను కూడా ఒక్కొక్కటిగా వదులుతూ వస్తోంది.
అక్కినేని నాగార్జున - విజయ్ బిన్ని కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'నా సామిరంగ' మూవీకి సంబంధించి ఇటీవలే హీరోయిన్ అషికా రంగనాథ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇందులో అంజి అనే కీలక పాత్రను చేస్తున్న టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్‌కు సంబంధించిన గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

తాజాగా విడుదలైన 'నా సామిరంగ' అంజి గ్లింప్స్ వీడియోలో అల్లరి నరేష్ పల్లెటూరి కుర్రాడిలా కనిపించాడు. అతడి యాస, బాడీ లాంగ్వేజ్ 'గమ్యం' సినిమాలో రోల్‌ను గుర్తు చేసేలా ఉంది. ముఖ్యంగా 'చేసేయ్ చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తది' అంటూ అల్లరి నరేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇది చూస్తుంటే ఇందులో అతడు నాగార్జున ఫ్రెండ్‌లా చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇదిలా ఉండగా.. 'నా సామిరంగ' మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యే చాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











