శిక్షలు వేయడం కాదు.. న్యాయం కూడా చేయాలి.. ఆకట్టుకుంటోన్న నరేష్ ‘నాంది’ ట్రైలర్
దిగ్గజ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్. కెరీర్ ఆరంభం నుంచీ కామెడీ చిత్రాల్లోనే నటిస్తూ బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తున్నాడు. మధ్య మధ్యలో కొన్ని ప్రయోగాలు చేసినా.. అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో హాస్యభరిత చిత్రాలకే ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'బంగారు బుల్లోడు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరేష్.. భారీ పరాజయాన్ని చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ప్రయోగాత్మక చిత్రంతో రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ నటిస్తోన్న చిత్రం 'నాంది'. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. ఫస్ట్ లుక్‌లో బట్టలు లేకుండా కనిపించి షాకిచ్చిన ఈ టాల్ హీరో.. టీజర్‌లోనూ అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'నాంది' ట్రైలర్ విడుదలైంది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఇది ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో అల్లరి నరేష్ నటన అద్భుతంగా ఉంది. కామెడీ హీరో అయినా.. సీరియస్ చిత్రంలో ఒదిగిపోయినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. మొత్తంగా ఇది వన్ మ్యాన్ షోగా ఉంది.

ఇక, ఈ ట్రైలర్‌లో పేపర్ బాయ్ అయిన నరేష్.. ఓ మర్డర్ కేసులో ఇరుక్కొవడం.. న్యాయస్థానం అతడికి ఐదేళ్ల జైలు శిక్ష వేయడం చూపించారు. అలాగే, జైల్లో పోలీసులు అతడిని చిత్ర హింసలకు గురి చేయడం.. బట్టలు లేకుండా వేలాడదీయడం వంటివి చూపించారు. అలాగే, ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్.. హీరోను కాపాడే లాయర్ పాత్రను పోషిస్తోంది. మొత్తంగా ఈ సినిమాతో అల్లరి నరేష్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై అల్లరోడు భారీ ఆశలే పెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











