‘పవన్ కల్యాణ్ మూవీని అడ్డుకోవడం దుస్పాహసమే.. ఆ నలుగురితో సంబంధం లేదు’
డిస్ట్రిబ్యూషన్ రంగంలో పర్సెంటేజీ విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్ల మూసివేత వివాదం టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు ముందు డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. అయితే సినిమా పరిశ్రమకు మేలు చేయాలని మా ప్రభుత్వం భావిస్తున్నది. కానీ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేయడం సంచలనం రేపింది. అయితే ఈ వివాదంలో ఆ నలుగురు అంటే.. దిల్ రాజు, ఏషియన్ సునీల్, డీ సురేష్ బాబు, అల్లు అరవింద్ ఉన్నారనే ఊహాగానాలు బలంగా మీడియాలో కనిపించాయి. దాంతో ఈ వివాదంపై, ఆ నలుగురు అంటూ నాపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను అంటూ అల్లు అరవింద్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ..
రెండు రోజుల నుంచి ఆ నలుగురు.. ఆ నలుగురు.. ఆ నలుగురు అంటూ వార్తలు, కథనాలు వస్తున్నాయి. ఆ నలుగురు కంబంధ హస్తాలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నలిగిపోతున్నది అనే వార్తలు ప్రసారం అవుతున్నాయి. కాబట్టి ఆ నలుగురితో నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆ నలుగురు అనేది 15 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత 10 మందికి ఆ సంఖ్య చేరుకొన్నది అని అల్లు అరవింద్ చెప్పారు.

ఆ నలుగురి వ్యాపారం నుంచి నేను బయటకు వచ్చాను. నాకు ఉన్న తెలంగాణలో ఒక్క థియేటర్ కూడా లేదు. తెలంగాణలో ఒకే ఒక థియేటర్ AAA సినిమాస్. దానికి నేను ఓనర్‌ను. ఆంధ్రాలో కూడా థియేటర్లన్నీ వదిలేసుకొన్నాను. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే.. అందులో 15 థియేటర్లకు లోపే నాకు ఉన్నాయి. వాటి లీజ్ కూడా రెన్యువల్ చేయవద్దని నా సిబ్బందికి చెప్పాను. కనుక నా వద్ద థియేటర్ లేవు అని చెప్పదలచుకొన్నాను అని అల్లు అరవింద్ అన్నారు.
ఆ నలుగురు అంటూ నా ఫోటోను పబ్లిష్ చేస్తే బాగుంటుందని నన్ను యాడ్ చేస్తున్నారు. విమర్శకు బాగుంటుందని నా పేరు వాడటం బాగుంటుంది. అయితే మీడియాను నేను కోరేది ఏమిటంటే.. ఆ నలుగురిలో నేను లేను. నా ఫోటోలు, నా పేరు వాడొద్దు. నా వృత్తి సినిమాలు నిర్మించడమే. మధ్యలో పంపిణీ వ్యవస్థలోకి వచ్చాను. అది నాకు సరిపోదని నేను బయటకు వచ్చాను. అంతకు మించి పంపిణీ వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదు అని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లు మూసి వేస్తున్నామనే ప్రకటనపై ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ స్పందించిన తీరు సమంజసంగా ఉంది. ఈ థియేటర్లకు సంబంధించి నిర్వహించిన మూడు మీటింగులకు వెళ్లలేదు. నాకు ఆ మీటింగ్‌కు వెళ్లడం ఇష్టం లేదు. అలాగే గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించిన సిబ్బందిని కూడా వెళ్లకూడదని చెప్పాను. కారణం ఏమిటంటే.. సింగిల్ థియేటర్లకు చాలా కష్టాలు ఉన్నాయి. కానీ ఛాంబర్, గిల్డ్, ఇతర వ్యవస్థలు తమలో తాము చర్చించుకొని.. ఆ తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపి మా ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి కనుక థియేటర్లు మూసివేస్తున్నామని అంటే అది సమంజసంగా ఉండేది అని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు.
థియేటర్ల మూసివేతకు కొందరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొన్నందున చిరాకు కలిగి నేను వెళ్లి ఆ సమావేశంలో మాట్లాడలేను. ఓ సమస్యకు సామరస్యంగా పరిష్కారం కాకపోతే మూసివేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి చర్యలు చేపట్టకుండా పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్‌కు రాబోతుండగా, మేము సినిమా హాళ్లను మూసివేస్తామనేది దుస్పాహసం. ఆ దుస్పాహసానికి పెద్దలు, చిన్నలు ముందడుగు వేయకూడదు. మన ఇండస్ట్రీ నుంచి వెళ్లి.. మన ఇండస్ట్రీకి మేలు చేస్తున్న వ్యక్తి ఆయన అంటూ పవన్ కల్యాణ్ చొరవపై అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అశ్వినీదత్ నిర్మించిన కల్కి సినిమా రిలీజ్ సమయంలో పవన్ కల్యాణ్ గారిని కలువడానికి వెళ్లాం. మా సినిమా వస్తున్నది. టికెట్ రేట్లు పెంచండి అని చెబితే సానుకూలంగా స్పందించారు. అలాగే చంద్రబాబు నాయుడిని కలవండి అని సూచించారు. కానీ ఇండస్ట్రీ వాళ్లు ఆ ప్రయత్నం చేయకపోగా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాకు తెలుసు అని వ్యక్తిగతంగా కలువడానికి ప్రయత్నించారు. పవన్ కల్యాణ్ గుర్తు చేసినా కూడా అది జరగలేదు అనే విషయాన్ని అల్లు అరవింద్ గుర్తు చేశారు.
అయితే నిన్న ఓ నిర్మాత మాట్లాడుతూ.. మా ప్రైవేట్ బిజినెస్.. మాకు ప్రభుత్వాన్ని కలిసే పనిలేదనే విధంగా మాట్లాడారు. ప్రభుత్వానికే సంబంధం లేకపోతే.. ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వాళ్లంతా వెళ్లి గత ప్రభుత్వాన్ని, చీఫ్ మినిస్టర్‌ను ఎందుకు కలిశారు.ఏ వ్యాపారమైనా ప్రభుత్వ సహకారం లేకపోతే అది సవ్యంగా జరగదు. సినిమా నిర్మాణం, ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుంది.కష్టం వస్తే ప్రభుత్వాన్ని కలువడం కరెక్ట్ కాదు. ఏపీ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ప్రకటన సమంజసమే అనిపించింది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా థియేటర్లను మూసివేస్తున్నామని ప్రకటించినందున నేను ఆ మీటింగ్ వెళ్లలేదు. దానికి నాకు సంబంధం లేదు. దానికి నాకు దయచేసి లింక్ పెట్టకూడదు అని అల్లు అరవింద్ మనవి చేశారు.


Click it and Unblock the Notifications











