భారత్ - పాక్ మధ్య యుద్ధ మేఘాలు .. అల్లు అర్జున్ ఎక్కడ? 7 ఏళ్ల నాటి వీడియో ట్రెండింగ్‌లోకి
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదుల మారణకాండను సామాన్యులు, సినీ , ఇతర రంగాల ప్రముఖులు ఖండించారు . టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తీవ్రవాదుల చర్యను ఖండించారు. మరణించిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గతంలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
భూతల స్వర్గం బైసరన్ లోయలో ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి పేర్లు కనుక్కుని మరి దారుణంగా హతమార్చారు. తీవ్రవాదుల కాల్పుల్లో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. భార్యాబిడ్డల ఎదురుగానే భర్తలను ముష్కరులు కాల్చేశారు. కొత్తగా పెళ్లయి హనీమూన్‌కి కాశ్మీర్ వచ్చిన వారికి కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఘోర విషాదాన్ని మిగిల్చారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

ఉగ్రవాదులను భారత్‌పై ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌కి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేయగా.. భారత్‌లోని పాకిస్తాన్ జాతీయులు తక్షణం దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. వాఘా - అటారీ సరిహద్దును మూసివేయడంతో పాటు పాకిస్తానీయులకు వీసాల మంజూరును నిలిపివేసింది. మరోవైపు.. భారత్ ఆగ్రహంతో ఊగిపోతుండటంతో ఇరు దేశాల సరిహద్దుల్లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ ఏ క్షణంలోనైనా దాడికి దిగుతుందని పాక్ వణికిపోతూ పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావం సినీ రంగం మీదా పడింది. భారతీయ చిత్ర పరిశ్రమలో పాక్ జాతీయులకు అవకాశాలు ఇవ్వకూడదని , వారు నటించిన సినిమాలను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫవాద్ ఖాన్ సినిమాను భారత్‌లో నిషేధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీలో హీరోయిన్‌గా చేస్తున్న ఇమాన్వీ ఇస్మాయిల్ జాతీయత మీద దారుణంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో తాను భారతీయురాలినని, పాకిస్తాన్‌తో తనకు .. తన కుటుంబానికి సంబంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది.
ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడేళ్ల క్రితం వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం నా పేరు సూర్య. అను ఇమ్మాన్యుయేల్, శరత్ కుమార్, అర్జున్ సర్జాలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 2018 మే 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అప్పట్లో నా పేరు సూర్య ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ దేశభక్తి, యుద్ధం, భారత సైన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను భారత సైన్యంలో చేరాలని అనుకుంటే ఎవ్వరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ తెలిపారు. కానీ నేను సమాధానం చెప్పాల్సింది? అనుమతి తీసుకోవాల్సింది? నా భార్య స్నేహ దగ్గరేనని చెప్పారు. ఓ రోజున ఆమెకు ఫోన్ చేసి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని, వెళ్లనా? వద్దా? అని అడిగానని అల్లు అర్జున్ తెలిపారు. డ్రెస్ వేసుకుని బయటికెళ్లి మార్చ్ ఫాస్ట్ చేయడం కాదని, బోర్డర్‌కి వెళ్లాల్సి వస్తుందని , మరి వార్‌లో పాల్గొనమంటావా? అని అడిగానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో నేను పోతేనని అంటే అంతకన్నా గర్వపడే సందర్బం లేదని స్నేహ అందని బన్నీ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. యుద్ధం ప్రారంభం కాబోతుందని , మరి అల్లు అర్జున్ ఎక్కడ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











