Allu Arjun: అల్లు అర్జున్ కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్.. ఆ బిల్డింగ్ కూల్చివేతకు రెడీ
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కుటుంబానికి అస్సలు టైం బాలేదు. గతేడాది సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆయనను అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతితో కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో ఉండగా.. తాజాగా జీహెచ్ఎంసీ ఈ ఫ్యామిలీకి షాకిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్
తొక్కిసలాట ఘటన తర్వాత బెయిల్‌పై విడుదలైన అల్లు అర్జున్.. తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇంటికి సినీ ప్రముఖులు క్యూకట్టి బల ప్రదర్శన చేయడం దుమారం రేపింది. ఆ తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో రేవంత్ రెడ్డిపై, తెలంగాణ ప్రభుత్వంపై అల్లు అర్జున్ నేరుగా విమర్శలు చేశారు. దాంతో సీరియస్ అయిన ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో తాను సీఎంగా ఉన్నంత వరకు సినిమాల స్పెషల్ షోలకు, బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అలాగే హైదరాబాద్ పోలీసులు కూడా.. సంథ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడానికి ముందు, వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఘటనలపై వీడియోను రిలీజ్ చేశారు.

రేవంత్‌తో బన్నీ షేక్ హ్యాండ్
ఆ తర్వాత పలువురు పెద్దలు రంగంలోకి దిగి ఇరుపక్షాలను శాంతింపజేసినట్లుగా ఫిలింనగర్‌లో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ తర్వాత జరిగిన గద్ధర్ అవార్డ్స్ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అల్లు అర్జున్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాంతో ఇక అంతా కలిసిపోయినట్లేనని సినీ వర్గాలు భావించాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు.
అల్లు బిజినెస్ పార్క్ నిర్మాణం
ఇటీవల నానమ్మ కనకరత్నం కన్నుమూయడంతో ఆయన షూటింగ్ అర్ధాంతరంగా రద్దు చేసుకుని ఇంటికి చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే పెద్ద కర్మ కార్యక్రమంలోనూ అంతా తానై వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అల్లు ఫ్యామిలీకి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో అల్లు అరవింద్ ఓ భవనాన్ని నిర్మించారు. నాలుగు అంతస్తుల నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అల్లు అర్జున్ తాతయ్య అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ బిజినెస్ పార్క్ నిర్మాణ పనులను నవంబర్ 2023లో ప్రారంభించి పూర్తి చేశారు.
ఆ పెంట్‌హౌస్‌ను కూల్చివేస్తాం
గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ, అల్లు ఆర్స్ సహా అల్లు అరవింద్ కుటుంబ వ్యాపారాలకు ఈ భవనం కేంద్రంగా ఉంది. అయితే ఇటీవల ఈ భవనంపై అదనంగా పెంట్‌హౌస్ నిర్మించింది అల్లు కుటుంబం. ఈ విషయం గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ పెంట్‌హౌస్‌ను కూల్చేస్తామని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ పెంట్‌హౌస్‌ను ఎందుకు కూల్చవద్దో వివరణ ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై అల్లు అరవింద్ కుటుంబం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











