AA23: అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ మూవీపై భారీ క్రేజ్.. షూటింగ్ జరగకుండానే ఐకాన్‌స్టార్ ఆల్ టైం రికార్డ్!
వెండితెరపై కొన్ని కాంబినేషన్లు అంచనాలను పెంచేస్తుంటాయి. ఫలానా దర్శకుడితో తమ హీరో పనిచేయాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటారు. ఆ సినిమా తెర మీదకు రాకుండానే ఎన్నో రికార్డులు, సంచలనాలు సృష్టిస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి రేర్ కాంబినేషన్‌లు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి కోవలోకే వస్తుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మూవీ. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే ఇండస్ట్రీ షాకైందంటే అతిశయోక్తి కాదు. తాజాగా లోకేష్ - బన్నీ మూవీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
పుష్ప సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా
పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ మూవీల తర్వాత ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తెలుగు రాష్ట్రాల స్థాయి నుంచి ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి రాజమౌళీ హీరోలు కాకుండా మరో స్టార్.. పాన్ ఇండియా రేంజ్‌కు ఎదగడం బన్నీతోనే సాధ్యమైంది. పుష్ప సిరీస్‌లో అల్లు అర్జున్ నటన, సుకుమార్ మేకింగ్‌తో దక్షిణాది ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. పాట్నాలో జరిగిన పుష్ప ఈవెంట్‌కు పోటెత్తిన జన సమూహాన్ని చూస్తేనే ఈ విషయం అర్ధమవుతుంది.

అట్లీతో ఏఏ 22
పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అటు ఈ క్రేజ్‌ను జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు బన్నీ. ప్రాజెక్ట్‌లు, దర్శకుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాల విషయంలో ఇండస్ట్రీ, అభిమానులు ఆసక్తిగా గమనించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా చేస్తున్నట్లు బన్నీ ప్రకటించారు. దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఫిలింనగర్ టాక్. ఇప్పటికే షూటింగ్‌ను అట్లీ పరుగులు పెట్టిస్తున్నారు.
లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ సినిమా
ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే అల్లు అర్జున్ మరో షాకిచ్చాడు. తన 23వ సినిమాను మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో చేస్తున్నట్లు ప్రకటించి కలకలం రేపాడు. ఇది అలాంటి ఇలాంటి షాక్ కాదు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తెరకెక్కించిన కూలీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో లోకేష్‌తో సినిమాలు చేసేందుకు కొందరు స్టార్స్ వెనకడుగు వేసినట్లు వార్తలు వచ్చాయి. దాంతో లోకేష్ తదుపరి సినిమా ఎవరితో? అంటూ పెద్ద చర్చ నడిచింది. ఈ క్రమంలో అనూహ్యంగా తాను అల్లు అర్జున్‌ను డైరెక్ట్ చేయబోతున్నట్లు లోకేష్ వెల్లడించడంతో కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి.
ఏఏ 23పై భారీ అంచనాలు
కోలీవుడ్‌లో అపజయం అనేది లేకుండా దూసుకెళ్తున్న లోకేష్ కనగరాజ్ జోరుకు కూలీ బ్రేకులు వేసింది. దాంతో తనను తాను నిరూపించుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యారు లోకేష్. క్రైమ్, డ్రగ్స్, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో లోకేష్ తీసే సినిమాలకు తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. అలాంటిది తొలిసారిగా అల్లు అర్జున్‌తో లోకేష్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లో 23వది కావడం విశేషం. సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ మూవీ అరుదైన రికార్డ్ సాధించింది.
ఏఏ23 ఆల్‌టైం రికార్డ్
అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్‌ల ఏఏ 23 సినిమా అనౌన్స్‌మెంట్‌ను తెలియజేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ ఒక గ్లింప్స్‌ను విడుదల చేసింది. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో గుర్రం మీద వస్తున్న హీరో వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ అనౌన్స్‌మెంట్ థీమ్ మ్యాజిక్‌తోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 355K (3.55 లక్షలు) రీల్స్ వచ్చాయట. ఇది ఇంత వరకు ఏ భారతీయ సినిమా సాధించని ఆల్ టైమ్ రికార్డ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బట్టి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్‌ల సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడే పరిస్ధితి ఇలా ఉంటే రేపు ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











