అల్లు శిరీష్ పెళ్లి వేడుకలకు దూరంగా అల్లు అర్జున్.. ఐకాన్‌స్టార్ ఎమోషనల్ పోస్ట్
గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్‌కు నయనిక రెడ్డితో వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. మార్చి 6వ తేదీన హైదరాబాద్‌లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి డేట్ దగ్గరపడిపోవడంతో రెండు కుటుంబాలు పెళ్లి వేడుకలు మొదలుపెట్టేశాయి. దీనిలో భాగంగా అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో మెగా - అల్లు కుటుంబాలు, ఇతర బంధుమిత్రులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో అల్లు శిరీష్ అన్నయ్య, ఐకాన్‌స్టార్ అర్జున్ కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అల్లు శిరీష్ - నయనికల పెళ్లికి సంబంధించిన ప్రతి వేడుకలోనూ అల్లు అర్జున్ మిస్ కాలేదు. అలాంటి ఈ వేడుకలకు ఆయన దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
గతేడాది అల్లు శిరీష్- నయనిక ఎంగేజ్‌మెంట్
అల్లు శిరీష్- నయనికలు ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేసిన అనంతరం పెద్దల అంగీకారంతో తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లారు. గతేడాది అక్టోబర్ 31న అల్లు శిరీష్ - నయనికల ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ, రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అల్లు శిరీష్ - నయనికల పెళ్లి గురించి ఇరు కుటుంబాలు అధికారిక ప్రకటన చేశాయి. మార్చి 6వ తేదీన వీరిద్దరి వివాహం నిర్వహిస్తామని చేశాయి.

అన్నయ్యకి నేను కొడుకుని
అయితే మార్చి 6కు ఓ స్పెషాలిటీ ఉంది. అదే రోజున అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల పెళ్లి రోజు. తనకు ఎంతో ఇష్టమైన అన్నయ్య పెళ్లిరోజే తాను కూడా చేసుకునేందుకు శిరీష్ ఓకే చెప్పడం .. అల్లు అర్జున్ పట్ల అతనికున్న ప్రేమను తెలియజేస్తుంది. ఇప్పుడే కాదు పలు సందర్భాలలోనూ బన్నీపై తన అభిమానాన్ని చాటుకున్నారు శిరీష్. బన్నీ నన్ను కేవలం తమ్ముడిలా చూడడు... కొడుకులా చూసుకుంటాడు. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నప్పుడు మై బేబీ శిరి.. మై బేబి శిరీ రాస్తుంటాడు. చాలా రోజుల తర్వాత ఎప్పుడైనా కలిస్తే ఇంకా చిన్నపిల్లాడిలాగే నా బుగ్గ గిల్లి ముద్దు చేస్తుంటాడు. మా అన్నయ్యకి నేనంటే అంత ప్రేమ. అలాంటి అన్నయ్యకి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. నేను లైఫ్‌లో ఏదైనపా సాధిస్తే అది అన్నయ్య ముందే సాధించేసి ఏం మిగల్చకుండా పెట్టాడని ఓ ఈవెంట్‌లో అల్లు అర్జున్ గురించి చెప్పుకొచ్చాడు శిరీష్.
అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో బన్నీ
అలాగే అల్లు అర్జున్ కూడా తమ్ముడికి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ.. కెరీర్, ఇతర వ్యవహారాల్లో సలహాలు ఇస్తుంటాడు. అల్లు శిరీష్‌ను హీరోగా నిలదొక్కుకునేలా చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు అల్లు అర్జున్. అందుకే అన్నయ్య పెళ్లి రోజే తన పెళ్లి జరగాలని ఆకాంక్షించారు శిరీష్. తమ్ముడి పెళ్లి గ్రాండ్‌గా నిర్వహించాలని అల్లు అర్జున్ కూడా దగ్గరుండి పెళ్లి పనులు చూసుకోవడంతో పాటు ప్రతి కార్యక్రమంలోనూ ముందుండి పాల్గొంటున్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు కూడా తన భార్య స్నేహారెడ్డితో కలిసి హాజరయ్యారు బన్నీ. ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా మారడంతో పాటు ఆయన ధరించిన షర్ట్ ధర కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. తమ్ముడి పెళ్లి సందర్భంగా షాంపేన్ బాటిల్ ఓపెన్ చేస్తూ.. హుషారుగా స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు బన్నీ.
హల్దీ వేడుకకు దూరంగా అల్లు అర్జున్
తాజాగా అల్లు శిరీష్ పెళ్లి వేడుకలను అధికారికంగా ప్రారంభిస్తూ అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఫిబ్రవరి 13న పసుపు దంచారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ దంపతులు, శిరీష్, చిరంజీవి సతీమణి సురేఖ, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని, చిరంజీవి కుమార్తె సుస్మితతో పాటు పలువురు బంధువులు, సన్నిహితులు సందడి చేశారు. శిరీష్‌తో పసుపు కొట్టించి ఆశీర్వదించారు. అయితే ఇలాంటి వేడుకకు బన్నీ లేకపోవడం చర్చనీయాంశమైంది. అయితే షూటింగ్స్ లేదా వ్యక్తిగత కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అటు హల్దీ వేడుకను తాను మిస్ కావడం పట్ల అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. హల్దీ వేడుకకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఆయన .. తాను ఇక్కడ ఉండాల్సింది కానీ మిస్ అయ్యానంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











