హైదరాబాద్‌కు అల్లు అర్జున్ ఫ్యామిలీ గుడ్‌బై? అల్లు అరవింద్ స్ట్రాంగ్ రియాక్షన్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. డ్యాన్స్, నటన, ఫైట్స్, ఇలా ప్రతి అంశంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ ఐకాన్‌స్టార్ స్థాయికి చేరుకున్నారు బన్నీ. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న ఏకైకా హీరోగా చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన పేరు మీద వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు అల్లు అర్జున్. అలాంటి బన్నీ.. హైదరాబాద్‌ను వీడనున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌ను, మార్కెట్‌ను నిలబెట్టుకునేందుకు అల్లు అర్జున్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా సినిమాలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఏప్రిల్ 8వ తేదీన బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రాకా నుంచి వదిలిన ఆయన ఫస్ట్ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కత్తుల్లాంటి గోళ్లతో, గడ్డం, గుండుతో అల్లు అర్జున్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అట్లీతో సినిమా ముగిసిన వెంటనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ జత కట్టనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీకి తాలూకా గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. ఈ తర్వాత సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా తదితరులతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నారు. ఈ లైనప్, ప్లానింగ్ ద్వారా తన టార్గెట్ ఏంటో ఆయన హింట్ ఇస్తున్నారు.
ఇదిలాఉండగా.. అల్లు అర్జున్ ఈ మధ్య హైదరాబాద్‌లో కంటే ముంబైలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏదైనా పని ఉంటే తప్పించి హైదరాబాద్ రావడం లేదు. అట్లీ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ అక్కడే జరుగుతుండటం ఒక కారణమైతే, కొన్ని వ్యక్తిగత కారణాలతో అల్లు అర్జున్ ముంబైలోనే ఉంటున్నారని ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఏకంగా తన మకాన్ని హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చాలని.. ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అవ్వాలని బన్నీ భావిస్తున్నట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.
అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68లో నివసిస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే అభిమానులతో ఆ ప్రాంతం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. పుష్ప మేనియా కారణంగా నార్త్ అభిమానులు, కేరళ అభిమానులు కూడా ఆయనను చూసేందుకు వస్తుంటారు. అలాంటిది తమ అభిమాన నటుడు హైదరాబాద్‌కు దూరమైతే ఎలా అంటూ ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. తాజాగా ఈ పుకార్లపై అల్లు అర్జున్ తండ్రి, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ స్పందించారు.
అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా ముంబైకి షిప్ట్ అవుతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చిచెప్పారు. బన్నీ కొత్త సినిమా షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే ఉండటం వల్లే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయితే బన్నీ మనసంతా హైదరాబాద్‌తోనే ఉంటుంది. ఇక్కడే సొంతిల్లు ఉంది.. పిల్లలు నగరంలోనే చదువుకుంటున్నారు. బంధువులు, స్నేహితులు అంతా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ముంబై ఎందుకు వెళ్తాడు. షూటింగ్ కోసమే బన్నీ ముంబైలో ఉంటున్నాడు తప్పించి అక్కడ స్థిరపడాలనే ఆలోచన ఆయనకి లేదని అల్లు అరవింద్ తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications



