పాడే మోసిన చిరంజీవి.. రుణం తీర్చుకొన్న రాంచరణ్, అల్లు అర్జున్!
తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా మారిన అల్లు, మెగా కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకొన్నది. స్వర్గీయ అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ మాతృమూర్తి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ మరణం ఆయా కుటుంబాలను కన్నీరుమున్నీరయ్యేలా చేసింది. పుట్టెడు దు:ఖంలో మునిగిన మెగా, అల్లు కుటుంబాలకు సినీ ప్రముఖులు, అభిమానులు అండగా నిలిచి వారి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అల్లు కనకరత్నమ్మ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ చేసుకొన్నారు. ఆమె అంత్యక్రియల వివరాల్లోకి వెళితే..
అల్లు అరవింద్ మాతృమూర్తి ఇకలేరు. ఆమె తుదిశ్వాస విడిచారనే వార్తతో చిరంజీవి, పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజోనోవా అందరూ వెంటనే ఇంటికి చేరుకొన్నారు. అయితే ఈ వార్త తెలిసే సమయానికి అల్లు అర్జున్ ముంబైలో అట్లీ సినిమా షూటింగులో ఉండగా.. రాంచరణ్ మైసూరులో పెద్ది షూటింగులో ఉన్నారు. ఈ విషాద వార్త తెలియగానే వెంటనే అల్లు అర్జున్, రాంచరణ్ హైదరాబాద్ చేరుకొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని నింపారు.

ఇదిలా ఉండగా, రాంచరణ్ అయప్ప దీక్షలో ఉన్నారు. ఆయన తన అమ్మమ్మ మరణవార్త వినగానే మాలను తీసేసి వెంటనే హైదరాబాద్ చేరుకొన్నారు. ఇక పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఆయన ఫోన్ ద్వారా అరవింద్, అల్లు అర్జున్‌కు పరామర్శలు తెలిపారు. అంతేకాకుండా ఓ ప్రత్యేక ప్రకటన ద్వారా సంతాపం తెలిపారు. దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను.
చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దారు. శ్రీమతి కనకరత్నమ్మ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అల్లు అరవింద్ గారికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని తన సంతాప ప్రకటనలో తెలిపారు.

ఇక కనకరత్నమ్మ గారి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జరిగాయి. ఆమెకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు కన్నీటి ద్వారా వీడ్కోలు పలికారు. మెగాస్టార్ చిరంజీవి తన అత్తమ్మ పాడెను మోసి తన రుణం తీర్చుకొన్నారు. తెలుగు సినిమా రంగంలో ఎదుగుతున్న చిరంజీవిని చూసి స్వయంగా ఆమెనే తన కూతురు సురేఖకు ఈడు జోడు అవుతాడని పెళ్లి ప్రస్తావన తీసుకు రావడం... వారిద్దరి పెళ్లి జరిగిపోయింది. అలా ఆమె కోరిక మేరకే అల్లు కుటుంబంలో చిరంజీవి భాగమయ్యారు.
ఇక నాన్నమ్మకు అల్లు అర్జున్, అమ్మమ్మకు రాంచరణ్ విషాద వదనంతో వీడ్కోలు తెలిపారు. ఆమె పాడెను మోసి తమ రుణాన్ని తీర్చుకొన్నారు. ఆమె చివరి ప్రయాణంలో వారిద్దరూ భాగమయ్యారు. అంత్యక్రియల తంతు ముగియగానే.. రాంచరణ్ పెద్ది షూటింగ్ కోసం మైసూర్ తిరిగి వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











