Pushpa 2 : మహేష్, ప్రభాస్ రికార్డ్స్ ఔట్ ... సౌతిండియాలో No 1గా అల్లు అర్జున్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప 2. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దీనిలో భాగంగా నవంబర్ 17న పాట్నాలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..
నిజానికి పుష్ప 2 సెట్స్‌పైకి వెళ్లినప్పుడే ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ డేట్‌ని లాక్ చేసేసింది చిత్ర యూనిట్ . కానీ అనూహ్యంగా డిసెంబర్ 6కి సినిమాను వాయిదా వేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఈ సినిమాను ఒక రోజు ముందుకు జరిపి అంటే డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తామని చెప్పడంతో వారు ఖుషీ అవుతున్నారు. ఇంతటి భారీ హైప్ ఉన్న నేపథ్యంలో పుష్ప 2కు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ టాక్.

థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూ. 640 కోట్లు, డిజిటల్ రైట్స్ రూ. 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు 11500 థియేటర్స్‌లో పుష్ప ది రూల్‌ని రిలీజ్ చేయనుండటం గమనార్హం.
విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది పుష్ప యూనిట్. పుష్ప ది రూల్ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఏకంగా ట్రైలర్ లాంచ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. నవంబర్ 17న బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్ స్టేడియంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించగా అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలుగులో కంటే హిందీ బెల్ట్‌లోనే పుష్పపై భారీ హైప్ ఉండటంతో దీనిని క్యాష్ చేసుకునేందుకు పాట్నాలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం పెట్టారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం కేవలం హిందీ నుంచే పుష్ప ది రూల్‌కి రూ. 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా. దాదాపు 2 నిమిషాలకు పైగా నిడివి ఉన్న పుష్ప 2 ట్రైలర్‌లో సినిమా మొత్తాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు సుకుమార్. షెకావత్, పుష్పరాజ్‌ల మధ్య పోరు ఆసక్తిగా కనిపిస్తోంది. అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ ఇద్దరూ పోటీపడినట్లుగా నటించడంతో పుష్ప 2 ట్రైలర్ దూసుకెళ్తోంది. అందుకు తగినట్లుగానే రికార్డులు బద్ధలవుతున్నాయి.
ఇప్పటి వరకు సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ట్రైలర్ 38 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని టాప్ ప్లేస్‌లో ఉండేది. కానీ దీనిని పుష్ప2 కేవలం 15 గంటల్లోనే అధిగమించి దాదాపు 40 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇదే స్పీడ్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు అల్లు అర్జున్. ఈ జోరు ఇలాగే కొనసాగితే సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు, హిందీ సహా ఇతర భాషల ట్రైలర్లను కూడా కలిపితే 24 గంటల్లోనే పుష్ప 2 అలవోకగా 150 మిలియన్ వ్యూస్‌ను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











