రాజయోగం అన్నావ్ .. కాస్తుంటే అల్లు అర్జున్ జైలుకే, వేణుస్వామిని ఏకిపారేస్తోన్న అల్లు ఆర్మీ
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి టైం అస్సలు బాగున్నట్లుగా లేదు. ఆయన ఎందులో వేలు పెడితే అది పెద్ద కాంట్రవర్సీగా మారుతుండగా.. జోస్యాలు దెబ్బకొడుతున్నాయి. గతంలో సెలబ్రెటీల భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన మాటలు అక్షరం పొల్లు పోకుండా జరగడంతో వేణుస్వామికి తెలుగునాట ఎక్కడా లేని పాపులారిటీ వచ్చింది. కానీ ప్రస్తుతం ఆయన ఏం చెప్పినా రివర్స్ కొడుతున్నాయి. దీంతో ఆయా సెలబ్రెటీల అభిమానులు, నెటిజన్లు వేణుస్వామిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
జ్యోతిష్యం చెప్పడంతో పాటు తాంత్రిక పూజలకు వేణుస్వామి పేరు తెచ్చుకున్నారు. ఎవరైనా సెలబ్రెటీ జాతకం బాలేకపోయినా, వారు జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని అనుకుంటున్నా వేణుస్వామి నేనున్నాంటూ కనిపించేవారు. రష్మిక మందన్న, సమంత, డింపుల్ హయాతి, అషు రెడ్డి, నిధి అగర్వాల్ ఇలా పలువురు హీరోయిన్లకు ఆయన గతంలో ప్రత్యేక పూజలు చేయించారు. వీరిలో చాలా మంది కెరీర్‌లో టాప్ ప్లేస్‌లోకి వెళ్లడంతో సెలబ్రెటీలకు ఆయనకు బాగా గురి కుదిరింది.

అయితే వేణుస్వామి చేయించే సదరు తాంత్రిక పూజల్లో మద్యం, వైన్ బాటిళ్లు కనిపించడం వివాదాస్పదమయ్యాయి. కొన్నాళ్లు వేణుస్వామి హవా బాగా నడవగా.. గత కొద్దినెలలుగా ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ జీవితం బాలేదని వేణుస్వామి చెప్పగా.. డార్లింగ్ మాత్రం వరుస విజయాలతో దూసుకెళ్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు దిగారు. ఇక తెలంగాణలో కేసీఆర్ , ఏపీలో జగన్, ఐపీఎల్‌లో హైదరాబాద్ గెలుస్తుందన్నారు కానీ ఇవన్నీ తేడా కొట్టడంతో ఆయన అడ్డంగా దొరికిపోయారు.
అన్నింటికి మించి శోభిత - నాగచైతన్యల వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వారిద్దరి జాతకం కలవలేదని ఈ జంట 2027లో విడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పాడు. దీంతో ఆయనపై ఏకంగా పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు కాగా, తెలంగాణ మహిళా కమీషన్ వరకు విషయం వెళ్లింది. ఈ దెబ్బతో ఇకపై తాను సెలబ్రెటీల జోలికి వెళ్లనని వేణుస్వామి తేల్చిచెప్పారు.
ఇలాంటి దశలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 వీక్షించిన వేణుస్వామి.. బన్నీ జాతకం అద్భుతంగా ఉందన్నాడు. ఆయనతో సినిమా తీసిన ఏ నిర్మాత నష్టపోడని, వచ్చే 15 ఏళ్ల పాటు అల్లు అర్జున్‌కు తిరుగులేదని జోస్యం చెప్పాడు. కట్ చేస్తే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో తెలుగు ప్రజలు షాకయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయకుంటే అల్లు అర్జున్ జైలుకెళ్లాల్సి వచ్చేది. దీంతో వేణుస్వామి అల్లు ఆర్మీకి దొరికిపోయారు. ఇదేనా మా హీరోకి నువ్వు చెప్పిన రాజయోగమంటూ సోషల్ మీడియాలో ఏకీపారేస్తూ ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. మరి దీనిపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











