హరిహర వీరమల్లు నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వచ్చేది అప్పుడే అంటూ!
టాలీవుడ్‌లో అతి తక్కువ మంది హీరోలకు మాత్రమే భారీ స్థాయిలో పాపులారిటీ ఉంది. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. అందుకు తగ్గట్లుగానే ఆయన ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూనే.. మరోవైపు సినిమాలతో సత్తా చాటుతోన్నారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఇలా ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి చిత్రాలతో అలరించారు. ఇప్పుడు మూడు, నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అలా ఇప్పుడు పవర్ స్టార్ చేస్తోన్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.
పవన్ కల్యాణ్ హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తోన్న సినిమానే 'హరిహర వీరమల్లు'. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా బ్రేకులు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కానీ, పవన్ డేట్స్ వల్ల మళ్లీ షూట్ లేట్ అయిపోయింది.

'హరిహర వీరమల్లు' మూవీ షూట్‌ను జూలై మొదటి వారం నుంచి ప్రారంభిస్తారని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'హరిహర వీరమల్లు షూటింగ్‌కు పవన్ కల్యాణ్ గారి డేట్స్ ఎక్కువగా లేవు. కాబట్టి వీలు చూసుకుని ఆయనే వచ్చి సినిమాను పూర్తి చేస్తారు' అన్నారు.
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. 'అందరూ అనుకుంటున్నట్లు జూలైలో పవన్ కల్యాణ్ గారు డేట్స్ ఇవ్వలేదు. దానిపై మాకేమీ చెప్పలేదు కానీ మా సినిమా కోసం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి, త్వరలోనే మళ్లీ రెడీ అవుతారని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజాసేవలో కూడా ఉన్నారు కాబట్టి.. ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము సినిమాను పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాం' అని చెప్పారు.

ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











