ఆసక్తిరేపుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ట్రైలర్
''ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వారు కొందరుంటే.. శక్తి మేరకు నయవంచన చేసేవారు కోకొల్లలు'' అంటూ రవితేజ నటించిన మూవీ ట్రైలర్ విడుదలైంది. రవితేజ, ఇలియానా హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'.
నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ కట్ చేసిన తీరు చూస్తుంటే రవితేజ మార్క్ వినోదంతో అభిమానులను పూర్తిగా సంతృప్తి పరిచేలా సినిమా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో మాస్ మహరాజ.... అమర్, అక్బర్, ఆంటోనీ అనే మూడు పాత్రల్లో కనిపించబోతున్నారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా ఒక్కో పాత్ర ఒక్కో విధంగా ప్రేక్షకులను అలరించబోతోంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇలియానా తెలుగు తెరకు దూరమై చాలా కాలం అయింది. చివరగా దేవుడు చేసిన మనషులు చిత్రంలో రవితేజతో నటించిన ఇల్లీ బేబీ మళ్లీ ఆయన సినిమాతోనే టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన 'మైత్రి మూవీ మేకర్స్' నుండి వస్తున్న సినిమా కావడం... గతంలో శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్లో హిట్ సినిమాలు వచ్చిన నేపథ్యంలో 'అమర్ అక్బర్ ఆంటోనీ'పై హైప్ మరింత పెరిగింది.


Click it and Unblock the Notifications











