సైరా థియేటర్‌లో వ్యక్తి హల్చల్.. ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే.. ఆ తర్వాత!
మెగాస్టార్ ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహా రెడ్డి ప్రదర్శించబడుతున్న ఓ థియేటర్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. థియేటర్ లోకి వచ్చిన ఓ వ్యక్తి, సైరా సినిమా చూస్తున్న ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే జల్లి హల్చల్ చేశాడు. దీంతో థియేటర్ యాజమాన్యం షో నిలిపివేసిందని సమాచారం. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? అందుకు కారణాలేంటి? వివరాల్లోకి పోతే..

ఓవర్సీస్ మార్కెట్.. ఊహించని ఘటన
తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో విడుదలైన సైరా నరసింహా రెడ్డి సినిమాకు ఓవర్సీస్ జనం నీరాజనం పలుకుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ ఆదరణ తెచ్చుకుంటోంది సైరా నరసింహా రెడ్డి సినిమా. ఇంతలో కెనడాలోని ఓ థియేటర్ ఊహించని ఘటన చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఒక్కసారిగా కత్తి బయటకు తీసి.. ప్రదర్శన నిలిపివేత
కెనడాలోని టొరొంటో నగరంలో ‘ల్యాండ్‌మార్క్ సినిమాస్'లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కత్తి బయటకు తీసి తెరను చించేశాడని తెలిసింది. అంతటితో ఆగక థియేటర్‌లో సైరా చూస్తున్న ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే వెదజల్లి నానా హంగామా చేశాడట. దీంతో వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం ప్రదర్శన నిలిపివేసిందని సమాచారం.

మరికొన్ని చోట్ల ఇలాంటి ఘటనలే
కెనడాలోని మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. సినిమా తెలుగు భాషలో ప్రదర్శిస్తుండటమే దీనికి కారణమని అంటున్నారు. ఒక్కసారిగా థియేటర్ లో భయానక వాతావరణం సృష్టించడంతో
ఒకింత అలజడి రేగింది. దుండగుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

కలెక్షన్స్ పరంగా భేష్
ఇదిలా ఉంటే ఓవర్సీస్ మార్కెట్ లో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది సైరా నరసింహా రెడ్డి. ఈ తరుణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం ట్రేడ్ వర్గాల్లో ఆందోళన నింపుతున్నాయి. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అక్కడి పోలీసు వర్గాలు సెక్యూరిటీ చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందింది.

'సైరా నరసింహా రెడ్డి' విశేషాలు
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











