జోరు మీదున్న ఆనంద్ దేవరకొండ... రెండో సినిమాకు సైన్ చేశాడు!
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' అనే పీరియడ్ డ్రామా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలవ్వగా మంచి స్పందన వచ్చింది. ఆనంద్ తన అన్నయ్య పేరు నిలబెడతాడనే నమ్మకం చాలా మందిలో వ్యక్తమైంది.
ఇంకా మొదటి సినిమా విడుదల కాకముందే ఆనంద్ దేవరకొండకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ... తన రెండో సినిమాకు కూడా సైన్ చేసినట్లు వెల్లడించారు.

'దొరసాని' మూవీ 40 సంవత్సరాల క్రితం నాటి కథతో నడుస్తుందని, తెలంగాణ యువకుడిగా కనిపిస్తానని.... అయితే తన రెండో సినిమా అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని, ప్రస్తుత కాలం నాటి కథతో సాగుతుందని, ఆంధ్రా యువకుడిగా కనిపిస్తానని తెలిపారు. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని, వినోద్ అనే కొత్త డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిపారు.
'దొరసాని' సినిమా విషయానికొస్తే.. 1980 నాటి బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ మూవీలో ఆనంద్ దేవరకొండకు జంటగా రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక నటిస్తోంది. 'షార్ట్ ఫిల్మ్ మేకర్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఆయన మెయిన్ స్ట్రీమ్ మూవీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
1980 కాలం నాటి పరిస్థితులకు అద్దం పడుతూ రియల్ లైఫ్ సంఘటనలను స్పూర్తిగా తీసుకుని 'దొరసాని' కథను తయారు చేసినట్లు, దీన్ని పూర్తి చేయడానికి తనకు 5 సంవత్సరాల సమయం పట్టినట్లు కెవిఆర్ మహేంద్ర తెలిపారు. అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ఒక టీనేజీ జంట మధ్య ప్రేమ వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందనేది ఇందులో చూపించబోతున్నట్లు తెలిపారు. జులై 5న విడుదల కాబోతున్న దొరసాని చిత్రాన్ని నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











