వీనికేం తెల్వది పీకది.. దొరసానులెప్పుడైనా బయటికొత్తార్రా.. విజయ్ దేవరకొండ తమ్ముడు అదరగొట్టాడుగా
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'దొరసాని'. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యశ్ రంగినేని, మధురా శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.
ఒక నిమిషం 8 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసేలా ఉంది. తెలంగాణ ప్రజల మాటలను అచ్చం అలాగే ఈ సినిమాలో డైలాగ్స్ గా పెట్టారు. ''చిన్న దొరసాని గడి నుంచి బయటికే రాదు.. వీనికేం తెల్వది పీకది.. దొరసానులెప్పుడైనా బయటికొత్తార్రా..'' అనే డైలాగ్ తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. చిత్రంలో ఆనంద్ దేవరకొండ ఓ దొరసానిని ప్రేమించడం జరుగుతుంది. అయితే ఆ ప్రేమలో ఎదురైన ఆటంకాలు, ఊహించని మలుపులు ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. పాత కాలంనాటి టీనేజ్ రొమాన్స్, ఆ కాలంలో ఇద్దరు ప్రేమికులు సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ సినిమాలో హైలైట్ సన్నివేశాలుగా నిలువనున్నాయి.

1980 కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఎక్కువ భాగం వరంగల్ ఖిలా లో షూట్ చేశారు. అక్కడి చారిత్రక ప్రదేశాలు చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్ అవుతాయని అంటున్నారు. ఇక ఈ చిత్రంతోనే జీవిత రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా రంగంలోకి అడుగుపెడుతుండటం విశేషం. 'దొరసాని' అనే ఓ క్యాచీ టైటిల్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. అతిత్వరలో దొరసాని ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











