నా ఉద్దేశం అదే.. సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్!
ఇటీవల సోషల్ మీడియా ప్రపంచంలో ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ (Instagram Subscription) ఫీచర్ భారీ చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా సినీ తారలు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తూ అభిమానులకు ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందిస్తున్నారు. నెలవారీ చార్జ్ చెల్లిస్తే ప్రత్యేక ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత అప్డేట్స్, లైవ్ చాట్స్ వంటి కంటెంట్‌ను అందించే ఈ ఫీచర్‌పై ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చర్చ మొదలైంది. ముఖ్యంగా యాంకర్ విష్ణు ప్రియ భీమినేని (Vishnu Priya Bhimeneni) ఈ ఫీచర్ ద్వారా వార్తల్లో నిలవగా, తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగిళ్ల (Ananya Nagalla) పేరు కూడా ఈ వివాదంలో వినిపిస్తోంది. దీంతో ఈ వివాదంపై అనన్య నాగిళ్ల స్పందించారు. ఓ వీడియోలో తన వాదన వినిపించారు. ఇంతకీ ఏమన్నారంటే..
తెలుగు సినిమాల్లో సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల. మల్లేశం, వకీల్ సాబ్ వంటి సినిమాలతో పద్ధతైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభించారు. నెలకు సుమారు రూ.390 చెల్లిస్తే ప్రత్యేక కంటెంట్ అందిస్తానని ఆమె ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. "అనన్య కూడా ఇప్పుడు గ్లామరస్ లేదా హాట్ కంటెంట్ ఇవ్వబోతుందా?", "విష్ణుప్రియ బాటలోనే నడుస్తుందా?" అంటూ అనేక కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరు విమర్శిస్తే.. మరికొందరు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పటికే వందలాది మంది ఆమె సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారని ప్రచారం జరగడంతో ఈ టాపిక్ మరింత వైరల్ అయింది.

అయితే ఈ ఆరోపణలు, ఊహాగానాల మధ్య అనన్య నాగళ్ల నేరుగా స్పందించారు. తనపై వస్తున్న కామెంట్స్, అనవసర విమర్శలు చూసి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని భావించిన ఆమె.. ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో మొదటగా ఆమె సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభించిన రోజే పోస్ట్ చేసినదని తెలిసింది. అందులో తన అసలు ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించారు. తాను ఈ ఫీచర్‌ను డబ్బు కోసం గానీ, గ్లామర్ కంటెంట్ కోసం గానీ ప్రారంభించలేదని, అభిమానులతో మరింత దగ్గరగా ఉండేందుకు మాత్రమే ప్రారంభించానని తెలిపారు.
అనన్య చెప్పిన ప్రకారం.. తన సబ్‌స్క్రిప్షన్‌లో సాధారణంగా సోషల్ మీడియాలో కనిపించని తన దినచర్య, ఆలోచనలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిగత విషయాలనుఅంశాలు షేర్ చేయాలనుకున్నారట. అందులో భాగంగానే ఆమె పంచుకున్న వీడియోలో "ఓం నమః శివాయ" మంత్రాన్ని 21 రోజులు, రోజుకు 108 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. ఈ వీడియోతో తాను ఎలాంటి అసభ్యకర కంటెంట్ లేదా సంచలన పోస్టులు పెట్టడం లేదని పరోక్షంగా స్పష్టం చేశారు.
ఈ వివరణతో సోషల్ మీడియాలో వచ్చిన అనేక ఊహాగానాలకు చెక్ పెట్టినట్టయింది. ఎందుకంటే ఇటీవలి కాలంలో సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ అంటే చాలామందికి "ఎక్స్‌క్లూజివ్ గ్లామర్ కంటెంట్" అనే భావన ఏర్పడింది. అదే కారణంగా అనన్యపై కూడా అలాంటి కామెంట్లు వచ్చాయి. కానీ ఆమె మాత్రం సబ్‌స్క్రిప్షన్‌ను ఒక క్లోజ్డ్ కమ్యూనిటీలా ఉపయోగించాలనుకుంటున్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంటే అభిమానులతో నేరుగా కనెక్ట్ అవ్వడం, వారితో మాట్లాడడం, పాజిటివ్ విషయాలు పంచుకోవడమే తన ఉద్దేశమని చెబుకొచ్చింది.
అయితే ఈ వివాదం మరో విషయం కూడా చూపించింది. సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ ఏదైనా కొత్త ఫీచర్ ప్రారంభిస్తే వెంటనే దానిపై అపోహలు, విమర్శలు, ట్రోలింగ్ మొదలవుతున్నాయి. అసలు విషయం తెలుసుకోకుండా కామెంట్లు చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అనన్య కూడా "ముందు నిజాలు తెలుసుకోండి.. తర్వాత అభిప్రాయం చెప్పండి" అనే సందేశాన్ని పరోక్షంగా ఇచ్చినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, అనన్య నాగళ్ల వకీల్ సాబ్, మల్లేషం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కొత్త పద్ధతిలో అభిమానులతో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆమె క్లారిటీ తర్వాత విమర్శలు తగ్గుతాయా? లేక మరింత చర్చ మొదలవుతుందా? అనేది చూడాలి.


Click it and Unblock the Notifications





