Exit Polls 2024: అలా మేనేజ్ చేశారు.. ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై సినీ నటి రోజా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగాయి. మరోసారి అధికారాన్ని అందుకోవాలని జగన్, ఈసారైనా పవర్ దక్కించుకోవాలని కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. అంచనాలకు మించి పోలింగ్ జరగడం, ప్రజలు సైతం అర్ధరాత్రి వరకు ఓపిగ్గా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. పోలింగ్ తేదీ నుంచి ఫలితాలు వెలువడే వరకు గ్యాప్ ఉండటంతో జనాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దేశంలోని సర్వే సంస్థలు, జాతీయ మీడియా ముందస్తు ఫలితాలను వెలువరించాయి. ఢిల్లీ సింహాసనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి అధిష్టించనుందని అన్ని సర్వేలు తేల్చిచెప్పాయి.

ఎన్డీయేకు 350 నుంచి 370 సీట్లు లభిస్తే.. ఇండియా కూటమి 200 లోపు స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేశాయి. ఇక దేశం దృష్టిని ఆకర్షించిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే కొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెబితే, మరికొన్ని మాత్రం కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపాయి. ఈ ముందస్తు అంచనాలు రాష్ట్రంలో కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు మంత్రి రోజా. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్‌పై ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు వండుతున్నారని దుయ్యబట్టారు.
ఎవరెన్ని చెప్పినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కావడం తథ్యమని రోజా స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి, పాలనలో పారదర్శకత ఉంది కాబట్టే గెలుపై ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నామని మంత్రి అన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని.. అందుకే మహిళలు, వృద్ధులు సైతం రాత్రి 9 గంటలైనా ఓపిగ్గా క్యూలైన్లలో వేచియుండి ఓటేశారని రోజా స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిని పెద్ద ఎత్తున అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని రోజా ప్రశంసించారు.
కూటమి పార్టీలు ఇప్పుడే జత కట్టలేదని, గతంలోనూ పోటీ చేశాయని ఆమె గుర్తుచేశారు. 2014లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని రోజా ఎద్దేవా చేశారు. కూటమికి క్రేజ్ లేదని.. వ్యవస్థలు చంద్రబాబు చేతుల్లో ఇష్టారాజ్యంగా పనిచేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్స్‌కు కొత్త రూల్స్ తీసుకొచ్చి తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని రోజా ఆరోపించారు.
ఇకపోతే.. 2014, 2019లలో నగరి నుంచి వరుస విజయాలు సాధించారు ఆర్కే రోజా. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు మంత్రిగా అవకాశం కల్పించారు. అయితే కేబినెట్‌లో చోటు దక్కించుకున్న తర్వాత రోజాకు సొంత నియోజకవర్గంలోనే , సొంత పార్టీ నుంచి నిరసన సెగ ఎక్కువైంది. ఈ విషయాన్ని ఆమె సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ పరిస్ధితుల్లో మార్పు రాలేదు.. ఒకానొక దశలో రోజాకు టికెట్ నిరాకరిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ జగన్ మాత్రం ఆమెపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించారు. ఈసారి నగరిలో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని రోజా గట్టి పట్టుదలతో ఉన్నారు.
అయితే మంత్రి పదవిని చేపట్టిన తర్వాత చిత్తూరు జిల్లాలో తీవ్ర అసమ్మతి ఎదుర్కొన్నది. ప్రతిపక్ష టీడీపీ కంటే.. సొంత పార్టీ నేతల నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చింది. దాంతో ఎన్నికల ముందే ఆమెకు కఠిన పరిస్థితులు ఎదుర్కోబోతున్నట్టు అభిప్రాయం వ్యక్తమైంది.


Click it and Unblock the Notifications











