AP Election Results Live: చెక్కుచెదరని టీడీపీ కంచుకోట.. హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం కూటమి స్పష్టమై ఆధిక్యంతో అధికారం దిశగా దూసుకెళ్తోంది. కడపటి వార్తలు అందే సమయానికి తెలుగుదేశం పార్టీ 133, వైసీపీ 15, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, హిందూపురంలో నందమూరి బాలకృష్ణలు ముందంజలో ఉన్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర కీలక వైసీపీ నేతలు ఓటమి దిశగా సాగుతున్నారు.
సినీనటుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం పైనా అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య 8000 ఓట్లకు పైగా మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2014లో తొలిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేసిన బాలకృష్ణ వైసీపీ అభ్యర్ధి నవీన్ నిశ్చిల్‌పై 16,196 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం 2019లో జగన్ ప్రభంజనంలోనూ 17 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు హిందూపురంలో మరో పార్టీ గెలవలేదంటే అక్కడి ప్రజలు టీడీపీకి ఎంత మద్ధతుగా నిలుస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. 1985, 89, 94లలో ఎన్టీఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకోగా.. ఆ తర్వాత 96లో నందమూరి హరికృష్ణ, 99లో సీసీ వెంకటరాముడు, 2004లో రంగనాయకులు, 2009లో అబ్థుల్ ఘనీలు హిందూపురంలో తెలుగుదేశం తరపున గెలుస్తూ వచ్చారు. ఈ ఆనవాయితీని బాలయ్య కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి హిందూపురంపై బాలకృష్ణ ప్రత్యేక దృష్టి పెట్టారు. పెద్దమొత్తంలో నిధులు తీసుకొచ్చి స్థానిక ప్రభుత్వాసుపత్రిని కార్పోరేట్ హాస్పిటల్‌కు తగ్గని రీతిలో అభివృద్ధి చేశారు. పట్టణంలో రోడ్లు వేసి పరిస్ధితిని పూర్తిగా మార్చేశారు. హంద్రీ - నీవా సుజల స్రవంతి ద్వారా చెరువులను నింపి నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారంగా చూపారు. దీనికి తోడు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు, కరోనా కాలంలో సొంత నిధులతో ప్రజలకు చేయూత అందించడం, రెండేళ్ల పాటు అన్న క్యాంటీన్ నిర్వహణ వంటి పనులు బాలయ్యకు మంచి పేరును తీసుకొచ్చాయి.
టీడీపీ కంచుకోటను బద్ధలుకొట్టడానికి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి హేమాహేమీలు ప్రయత్నించారు. అయితే జగన్ వైసీపీని స్థాపించడం, ఆ తర్వాత అధికారంలోకి రావడంతో హిందూపురంపై కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న వాల్మీకి, మైనారిటీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరంతా తొలి నుంచి టీడీపీ వైపే ఉన్నారు. 2024 ఎన్నికల్లో బాలకృష్ణను ఎలాగైనా ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్న వైఎస్ జగన్ మహిళను నిలబెట్టారు.

బెంగళూరులో స్థిరపడిన చిత్తూరు జిల్లాకు చెందిన దీపికను అభ్యర్ధిగా ప్రకటించారు. గతంలో బాలయ్య చేతిలో ఓటమి పాలైన మహమ్మద్ ఇక్బాల్ మరోసారి టికెట్ అడుగుతారనే అనుమానాలతో హిందూపురం ఇన్‌ఛార్జీగా నియమించి , ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. దీపికకు అన్ని రకాలుగా అండగా నిలిచారు. తనకు అవకాశం కల్పించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే వైసీపీ హిందూపురంలో నాలుగు వర్గాలుగా విడిపోయి ఉంది. వీరి మధ్య రాజీ కుదిర్చి వైసీపీ విజయం కోసం శ్రమించాల్సిందిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











