‘పుష్ప’లో మరో హీరోయిన్ కూడా: సుకుమార్ ప్లాన్‌కు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న సమయంలో కరోనా ప్రభావం పెరగడంతో షూటింగ్‌ను నిలిపివేశారు. అదే సమయంలో సినిమా విడుదలను సైతం వాయిదా వేసేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందుతోన్న 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న నేపథ్యంలో... అల్లు అర్జున్‌తో సహా మిగిలిన వాళ్లందరి పాత్రలనూ పొడిగించాడు సుకుమార్. ఈ క్రమంలోనే అదనపు గ్లామర్ కోసం మరో హీరోయిన్‌తో చిన్న పాత్రను చేయించాలని తాజాగా అతడు ప్లాన్ చేసినట్లు తెలిసింది. దీనికి బన్నీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని అంటున్నారు. దీంతో ఆ పాత్రకు ఏ భామను తీసుకుంటే బాగుంటుంది అన్న దానిపై సుక్కూ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మరో హీరోయిన్ గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అందుకు అనుగుణంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా చేస్తుండగా.. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇక, దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











