ఏపీలో ఇకపై బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అడ్డంకులు తొలగినట్లేనా? టాలీవుడ్‌లో నూతన ఉత్సాహం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 175 స్థానాలకు గాను కూటమి 165 చోట్ల, వైసీపీ 10 చోట్ల విజయం సాధించింది. జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కపోవడం గమనార్హం. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలవడం విశేషం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి 160 పైచీలుకు స్థానాల్లో గెలుస్తుందని సినీ నిర్మాత అశ్వినీదత్ ముందే జోస్యం చెప్పారు.
ఆయన చెప్పినట్లే ఫలితాలు వెలువడటంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఏపీలో కూటమి విజయం సాధించిన నేపథ్యంలో అశ్వినీదత్ నేతృత్వంలోని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న 'కల్కి 2898 ఏడీ ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపులు ఉంటాయని ఆకాంక్షిస్తున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమపై కక్ష గట్టినట్లుగా వ్యవహరించారు. సామాన్యులకు టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకొస్తానంటూ మొండిగా వెళ్లారు. టికెట్‌లు బుక్ చేసుకునే ఫ్లాట్‌ఫాంలను పక్కకుపెట్టి ప్రభుత్వ ఆజమాయిషీలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ పరిధిలో వెబ్ పోర్టల్ తీసుకొచ్చేందుకు కసరత్తు జరిగింది.
టికెట్ రేట్లను నియంత్రిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35పై పెద్ద దుమారమే రేగింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోపై టాలీవుడ్ మండిపడింది. ఆంధ్రా సీఎం .. చిత్ర పరిశ్రమ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు పెద్దలు మండిపడ్డారు. దీనికి తోడు వైసీపీ నేతలు - సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధం, ట్వీట్స్ వార్ జరిగి ప్రభుత్వానికి - చిత్ర పరిశ్రమకు మధ్య దూరం మరింత పెంచింది.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని తాడేపల్లిలో సీఎం జగన్ వద్దకు హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళితో కలిసి వెళ్లి తమ ఇబ్బందులను తెలియజేశారు. అయితే చిరంజీవిని జగన్ అవమానించారంటూ ఆయన అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవి అందరితో సఖ్యతగా ఉంటారని, వివాదాలకు దూరమని అలాంటి వ్యక్తిని జగన్ అవమానించారని ఫైర్ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయం గేటు బయటే వాహనాలు ఆపివేసి.. సినీ ప్రముఖులను నడిపించుకుంటూ తీసుకొచ్చారని పవన్ దుయ్యబట్టారు. అయితే పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలను రద్దు చేశారు జగన్. ఈ నిర్ణయం కారణంగా టాలీవుడ్ పెద్ద మొత్తంలో ఏపీ నుంచి ఆదాయాన్ని కోల్పోయింది.
పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల విడుదలకు జగన్ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించినే విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా జనసేనాని పలు వేదికలపై ప్రస్తావించారు కూడా. తనపై ఉన్న కోపంతో సినీ పరిశ్రమకు అన్యాయం చేయొద్దని ఆయన కోరారు. మిగిలిన హీరోల అభిమానులు కూడా జగన్‌కు ఓటు వేయొద్దని పవన్ సూచించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి టాలీవుడ్‌కు మంచి రోజులు వచ్చాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ బ్యాన్ చేసిన బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు ఇకపై సులభంగా అనుమతులు దక్కుతాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











