తారకరత్న కుమార్తె హాఫ్ శారీ వేడుక.. కనిపించని బాలయ్య, చంద్రబాబు , అన్నీతానైన అలేఖ్య
నందమూరి వారసుడు తారకరత్న కన్నుమూసి అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే అభిమానులకు నమ్మకం కలగడం లేదు. మంచి మనిషిగా, వివాదరహితుడిగా పేరున్న తారకరత్న జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని, కుటుంబానికి దూరమై ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆగర్భ శ్రీమంతుడైనా ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నారు. అన్నింటికి ఎదురొడ్డి నిలిచి జీవితంలో మరో ప్రస్థానం మొదలుపెడుతున్న దశలో విధి తారకరత్నను చిన్న చూపు చూడటంతో చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన మరణంతో భార్యాబిడ్డలు దిక్కులేని వాళ్లు అయ్యారు.
2024 ఎన్నికలకు ముందు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు గాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారకరత్న గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. దీంతో టీడీపీ కేడర్ ఆయనను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి అక్కడి నుంచి బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 18న శివరాత్రి రోజున శివైక్యం చెందారు తారకరత్న. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న తారకరత్న చిన్న వయసులోనే కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని కొన్నేళ్లపాటు కుటుంబాలకు దూరంగా ఉన్నారు తారకరత్న - అలేఖ్య రెడ్డి దంపతులు. ఇప్పుడు భర్త కూడా దూరం కావడంతో అలేఖ్య బాధ వర్ణనాతీతం. అయితే తారకరత్న బాబాయ్, టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు వీరి బాధ్యతను తీసుకున్నారని ఫిలింనగర్ టాక్. కానీ అలేఖ్య మాత్రం భర్తతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తారకరత్న ఫోటోలు, వీడియోలు, ఎమోషనల్ పోస్టులను పెడుతుంటారు.

తారకరత్న మరణం తర్వాత వారి కుటుంబంలో తొలి శుభకార్యం జరిగింది. తారకరత్న - అలేఖ్య దంపతుల పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ హైదరాబాద్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు కూతురిని అందంగా ముస్తాబు చేశారు అలేఖ్య. పూల జడతో , సాంప్రదాయబద్ధంగా నగలు ధరించి హాఫ్ శారీలో కుందనపు బొమ్మగా ఉంది నిష్క. తన తల్లి అలేఖ్య, ఇద్దరు తమ్ముళ్లతో ఈ చిన్నారి ఫోటో దిగింది. తండ్రి తారకరత్న చిత్రపటానికి నివాళులర్పించిన నిష్క.. ఆయన ఆశీస్సులు తీసుకుంది.
ఈ కార్యక్రమానికి అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరైనట్లుగా ఫిలింనగర్ టాక్. అంతా బాగానే ఉంది కానీ తారకరత్న మేనమామ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బాబాయ్ నందమూరి బాలకృష్ణ ఇతర నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. నిష్క హాఫ్ శారీ ఫంక్షన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో ఏ ఒక్క దానిలో బావబామ్మర్ధులు కనిపించలేదు. దీంతో వారు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారా? లేక మరేదైనా కారణమా? అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











