సీనియర్ నటి కన్నుమూత .. చంద్రబాబు, బాలకృష్ణ దిగ్భ్రాంతి
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ , నటరత్న నందమూరి తారక రామారావును తెలుగు తెరకు పరిచయం చేసిన అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు. ఆమె వయసు 102 సంవత్సరాలు. వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణవేణి ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి డాక్టర్ కాగా.. చిన్న వయసులోనే నాటక రంగం వైపు అడుగులు వేశారు. 1936లో విడుదలైన సతీ అనసూయతో బాటనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇందులో నటనకు గాను కృష్ణవేణికి మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు పోటెత్తాయి. దీంతో ఆమె తన మకాంను మద్రాసుకు మార్చారు. 1939లో మీర్జాపురం జమీందార్ జమీందార్‌ను పెళ్లాడిన కృష్ణవేణి.. వివాహం తర్వాత కూడా తన నటనను కొనసాగించారు.

దక్షయజ్ఞం, జీవనజ్యోతి, భీష్మ, గొల్లభామ, ఆహుతి వంటి చిత్రాల్లో ఆమె నటించారు. మీర్జాపురం రాజావారికి మద్రాసులో శోభనాచల స్టూడియోస్ ఉండటంతో ఆ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించారు కృష్ణవేణి. 1949లో తెలుగు చలన చిత్ర చరిత్రలోని క్లాసిక్స్‌లో ఒకటిగా చెప్పుకునే మనదేశంను నిర్మించిన ఆమె ఈ సినిమా ద్వారా నందమూరి తారక రామారావును, ఎస్టీ రంగారావును, నేపథ్య గాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
ఆ తర్వాత 1979లో దాంపత్యం చిత్రం ద్వారా మరో సంగీత దర్శకుడు రమేశ్ నాయుడును వెండితెరకు పరిచయం చేశారు. నటి, నిర్మాతగానే కాదు.. సింగర్ గానూ కృష్ణవేణి అలరించారు. కీలు గుర్రం, బాల మిత్రుల కథలో పలు పాటలను ఆమె పాడారు. సినీ రంగానికి కృష్ణవేణి చేసిన సేవలకు గాను 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
కృష్ణవేణి మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. 102 ఏళ్ల పాటు పరిపూర్ణ జీవితం అనుభవించిన ఆమె.. మనదేశం చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ను సినీ రంగానికి పరిచయం చేశారని చంద్రబాబు తెలిపారు. కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు సీఎం.
కృష్ణవేణి మరణం పట్ల ఎన్టీఆర్ కుమారుడు, అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావు గారికి తొలి అవకాశం అందించడంతో నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ఓ అధ్యాయమని బాలయ్య అన్నారు. ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు, శత జయంతి వేడుకలలో ఆమెను ఘనంగా సత్కరించామని.. కృష్ణవేణి గారి మరణం మా కుటుంబానికి తీరని లోటని , వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బాలకృష్ణ.


Click it and Unblock the Notifications











