నా కూతురికి బొక్కలు విరగ్గొట్టడం నేర్పిస్తున్నా.. జాగ్రత్త, రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డాక్టర్లు రోడ్డెక్కారు. స్వయంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం వీరి పక్షాన నిలవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అత్యవసర సేవలు మినహా.. సాధారణ చికిత్సను డాక్టర్లు పక్కనపెట్టేయడంతో సామాన్యులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆగస్ట్ 8న నైట్ షిఫ్ట్‌లో ఉన్న వైద్యురాలిపై తెల్లవారుజామున అత్యాచారం జరిగింది. మర్నాడు ఉదయం ఆసుపత్రి సెమినార్ హాల్‌లో నగ్నంగా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి సిబ్బంది గుర్తించారు. అయితే బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యురాలి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.

ఆమె మర్మావయవాలతో పాటు కళ్లు, నోటీలో రక్తస్రావం అయ్యిందని.. ముఖం, గోళ్లు సహా శరీరమంతా గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడించారు. బాధితురాలి శరీరంలో దాదాపు 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా గుర్తించారు. దీనిని బట్టి చూస్తే తమ బిడ్డపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ వీర్యం మోతాదు కేవలం ఒకే వ్యక్తికి సాధ్యం కాదని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు.
మరోవైపు.. కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని డాక్టర్ల భద్రత కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బాధితురాలికి న్యాయం చేయాలని, దోషులకు శిక్ష పడేలా చేయాలని పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ లిస్ట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య , సినీ నటి రేణూ దేశాయ్ కూడా చేరారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకొక పోస్ట్ పెడుతున్న ఆమె.. ఇవాళ ఘాటుగా స్పందించారు.
కోల్‌కతా ఘటన నేపథ్యంలో సమాజంలో అమ్మాయిలు తనను తాను రక్షించుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ , ఇతర ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలనే అర్ధం వచ్చేలా ఆమె పోస్ట్ ఉంది. స్త్రీలను గౌరవించడం మీ కొడుకుకి నేర్పించాలని.. ఎందుకంటే తాను తన కుమార్తెకు బొక్కలు విరగ్గొట్టడం నేర్పిస్తున్నానని రేణూ పోస్ట్ చేశారు. అంతేకాదు.. దీని బ్యాక్‌గ్రౌండ్‌లో కరాటే నేర్చుకుంటున్న ఫోటోను జత చేసింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











