అల్లు అర్జున్‌పై పవన్ కల్యాణ్ ఎటాక్.. పుష్ప మూవీని ట్రోల్ చేసిన డిప్యూటీ సీఎం!
ప్రకృతి, పర్యావరణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ప్రాధాన్యతనిస్తారు. రాజకీయాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని విలాసవంతమైన ఇంటిని వదిలి ఊరి చివరన ఉన్న తన ఫాంహౌస్‌లో నిరాడంబరంగా జీవించడమే ఆయనకే అలవాటు. అక్కడ పశువులతో ఆడుకుంటూ, చెట్లతో మాట్లాడుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ సేదతీరేవారు జనసేనాని. పర్యావరణం పట్ల ఉన్న ఈ ప్రేమే జనసేన మూల సిద్ధాంతాల్లో ప్రకృతికి కూడా పవన్ ప్రాధాన్యతను ఇచ్చేలా చేసింది.
ఏపీ డిప్యూటీ సీఎంగా నచ్చిన పోర్ట్‌ఫోలియా తీసుకోమని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినా.. తనకు ఎంతో ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, పంచాయతీ రాజ్, శాస్త్ర, సాంకేతిక శాఖలను స్వీకరించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అడవుల పెంపు, సామాజిక ఉద్యానవనాలపై ఆయన దృష్టి సారించారు. పర్యావరణ సంబంధిత అంశాలపై పవన్‌కున్న అవగాహనను చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. పర్యావరణానికి చేటు చేస్తున్న కోనో కార్పస్ చెట్ల నరికివేతకు డిప్యూటీ సీఎం ఆదేశాలిచ్చారు.

ఇదిలాఉండగా.. అల్లు అర్జున్ కారణంగా మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరుగుతోంది. గతంలో చేసిన పొరపాట్లను మెగా ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోకపోయినా.. ఇటీవల ఎన్నికల్లో బన్నీ.. జనసేనానికి కాకుండా వైసీపీకి ప్రచారం చేయడాన్ని మెగా కాంపౌండ్ సీరియస్‌గా తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది. పవన్ ప్రమాణ స్వీకారం, చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ ఇలా ఎక్కడా అల్లు ఫ్యామిలీ జాడ లేదు. ఇప్పటికే అల్లు అర్జున్‌పై నాగబాబు, సాయిథరమ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చిరంజీవి రంగంలోకి దిగి పరిస్ధితిని అదుపు చేసినట్లుగా ఫిలింనగర్ టాక్.
అల్లు అర్జున్‌పై ఎప్పుడూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన దాఖలాలు లేవు. అలాంటిది ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నాయి. డిప్యూటీ సీఎం, ఏపీ అటవీ శాఖ మంత్రి హోదాలో కర్ణాటక పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని.. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు.

ఈ సందర్భంగా బెంగళూరులో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లో ఒకప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు చేసేవారని, ఇప్పుడు స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్లు చేస్తున్నారంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ తరహా రోల్స్ వేయడం వల్ల సమాజానికి మంచి కంటే చెడు ఎక్కువ చేసిన వారం అవుతామని పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అల్లు అర్జున్ గురించి చేసినవేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్పలో హీరో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు. పవన్ కామెంట్స్‌పై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరు హీరోలను ఉద్దేశించే డిప్యూటీ సీఎం జనరల్‌గా చెప్పారని మెగా ఫ్యాన్స్ కవర్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎటు తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











