1 లక్షకు 5 లక్షలు.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై జోరుగా బెట్టింగులు.. లీకైన ఆడియో!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమాహేమీలు బరిలో నిలిచిన కుప్పం, పులివెందుల, హిందూపురం, మంగళగిరిని మించి ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురంపై పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణం. స్థానిక , జాతీయ మీడియాల ఫోకస్ కూడా ఈ నియోజకవర్గంపైనే ఉండటం గమనార్హం.
ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసిన ఆయన రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. కారణాలు ఏమైనా కానీ ఎక్కడో తప్పు జరిగిందని అంతర్గత సమీక్షలో పవన్ తేల్చారు. ఈసారి అలాంటి లోపాలకు తావు ఇవ్వకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు పవన్ కళ్యాణ్.

ఎక్కడ పోటీ చేసేది ముందు నుంచి చెప్పకుండా తన పని సైలెంట్‌గా చేసుకెళ్లారు. కాపు సామాజికవర్గం, మెగా అభిమానులు బలంగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకున్నారు. పవన్ కోసం నాగబాబు, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లతో పాటు జబర్దస్త్ నటులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, జానీ మాస్టర్, ఆర్కే సాగర్ తదితరులు ప్రచారం చేశారు. వీరికి తోడు టీడీపీ , జనసేన, బీజేపీ కేడర్ పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించారు.
పవన్ కళ్యాణ్ , జనసేన నేతల కన్నా ఆయన అభిమానులు పిఠాపురంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పిఠాపురానికి క్యూకట్టారు. నియోజవర్గంలోని గడప గడపకు వెళ్లి పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు. క్షేత్ర స్థాయిలో ప్రచారంతో పాటు సోషల్ మీడియాలోనూ పవన్ భావజలాన్ని, జనసేన సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లారు.

జూన్ 4న లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటామని జగన్, వైసీపీని గద్దె దించుతామని కూటమి గట్టి పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. వైసీపీ, కూటమికి వచ్చే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు.. మెజారిటీలపై పందాలు కాస్తున్నారు. రాష్ట్రంలోని వీఐపీ స్థానాలైన కుప్పం, పులివెందుల, హిందూపురం, నగరి, మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం స్థానాలపై కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగులు కడుతున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంపైనే రూ.వందల కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతారని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన గెలుస్తారా, ఓడిపోతారా అని కాకుండా మెజారిటీ ఎంత వస్తుందనే దానిపైనే బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అందరికంటే పవన్ కళ్యాణ్‌కే ఎక్కువ మెజారిటీ వస్తుందని పందాలు కాస్తున్నారు. భారీ మెజారిటీ వస్తుందని లక్ష, రాకపోతే రూ.5 లక్షలు కింద 1:5 రేషియాలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.
బెట్టింగ్ నిర్వాహకులు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కస్టమర్, బెట్టింగ్ నిర్వాహకుడికి మధ్యన జరిగిన టెలిఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను ఓ ఛానెల్ ప్రచారం చేసింది. అందులో పవన్ మెజారిటీపై లక్షకు ఐదు లక్షలు పందాలు వేస్తున్నామని.. జగన్, చంద్రబాబు, లోకేష్‌ల కంటే పవన్‌కే ఎక్కువ మెజారిటీ వస్తుందని పందాలు కాస్తున్నామని నిర్వాహకుడు చెబుతాడు. వారి ముగ్గురి కంటే పవన్‌కు ఎక్కువ మెజారిటీ వస్తుందని కస్టమర్ లక్ష ఇవ్వాలని.. రాకుంటే తామే రూ.5 లక్షలు ఇస్తామని అంటాడు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ అభిమానులు దీనిని భారీగా షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











