Upcoming Releases: ఏప్రిల్ లో అదిరిపోయే సినిమాలు.. ఒక్కరోజే 3, పాన్ ఇండియాతోపాటు!
2023 సంవత్సరం ప్రారంభం స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. దాదాపుగా అందరూ మంచి హిట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు. సంక్రాంతి బరిలో చిరంజీవి, రవితేజ, బాలకృష్ణ హిట్లు కొట్టగా.. విజయ్, అజిత్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నారు. ఇక ఫిబ్రవరిలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సాలిడ్ హిట్ కొట్టి రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వైపుకు దూసుకువెళ్తున్నాడు. కల్యాణ్ రామ్ అమిగోస్ కూడా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక వచ్చే నెల అంటే ఏప్రిల్ పాన్ ఇండియా, చిన్న సినిమాలతో ముస్తాబవుతోంది. రవితేజ, సమంత, విక్రమ్ వంటి స్టార్స్ తో పాటు మీడియం హీరోలు కూడా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

రావణాసుర
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, అనూ ఇమ్మాన్యూయేల్, పూజిత పొన్నాడ వంటి ముద్దుగుమ్మలు గ్లామర్ తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న ఈ మూవీలో అక్కినేని సుశాంత్ విలన్ గా అలరించనున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

శాకుంతలం
టాలీవుడ్ స్టార్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లేటెస్ట్ లేడీ ఒరియెంటెడ్ సినిమా శాకుంతలం. ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికీ అనేకసార్లు వాయిదా పడింది. గ్రాఫిక్స్ వంటి తదితర కారణాలు చెప్పుకొచ్చిన మేకర్స్ తాజాగా విడుదల తేదిని ప్రకటించారు. అందమైన ప్రేమ కావ్యంగా, ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమాను ఏప్రిల్ 14న పాన్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఉగ్రం
టాలీవుడ్ లో కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ రూట్ మార్చి సీరియస్ అండ్ సోషల్ ఎలిమెంట్స్ పై సినిమాలు చేస్తున్నాడు. నరేష్ నటించిన నాంది సినిమా మంచి హిట్ సాధించగా గతేడాది వచ్చిన ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం సినిమా పర్వాలేదనిపించుకుంది. నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఉగ్రం సినిమాతో మాస్ లుక్ లో ఎంటర్టైన్ చేయనున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.

రుద్రుడు, విరూపాక్ష..
డైరెక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. ముఖ్యంగా ఆయన హారర్ చిత్రాలతో బాగా పాపులర్ అయ్యాడు. ఆయన హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రుద్రుడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. బైక్ యాక్సిడెంట్ తర్వాత విరామం తీసుకున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుకుమార్ కథ సిద్ధం చేసిన ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కానుంది.

పొన్నియన్ సెల్వన్ 2
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా మొదటి పార్ట్ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలై మంచి విజయం సాధించింది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూలిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ వంటి స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా రెండో పార్టు ఏప్రిల్ 28న విడుదల కానుంది. వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఏజెంట్
అక్కినేని అఖిల్ సాలిడ్ హిట్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఒక్క రోజు తర్వాత అంటే ఏప్రిల్ 29న పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్ లోని నాలుగో చిత్రం PVT04 విడుదల కానుంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











