Pushpa 2 ; మళ్లీ మొదలెట్టిన వేణుస్వామి .. అల్లు అర్జున్ జాతకంపై సంచలన వ్యాఖ్యలు ,
తెలుగు నాట సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల భవిష్యత్తు గురించి చెబుతూ స్టార్ సెలబ్రెటీగా మారిపోయారు వేణుస్వామి. ఈయన చెప్పిన చాలా జోస్యాలు చాలా వరకు ఫలించడంతో ఎంతోమంది వేణుస్వామి ఇంటికి క్యూకట్టారు. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య- సమంత విడిపోతారని ఆయన చెప్పిన ప్రిడిక్షన్ అక్షరాల నిజం కావడంతో జనాలకు బాగా గురి కుదిరింది. అయితే అనుకోకుండా ఈ మధ్య కొన్ని సమస్యల్లో చిక్కుకోవడంతో సైలెంట్ అయిపోయారు వేణుస్వామి.
జ్యోతిష్యం చెప్పడంతో పాటు తాంత్రిక పూజలకు వేణుస్వామి కేరాఫ్‌గా నిలిచాడు. రష్మిక మందన్న, సమంత, డింపుల్ హయాతి, అషు రెడ్డి, నిధి అగర్వాల్ ఇలా పలువురు హీరోయిన్లకు ప్రత్యేక పూజలు చేయించిన వీడియో వైరల్ అయ్యాయి. సదరు పూజల్లో మద్యం, వైన్ బాటిళ్లు కనిపించడంతో వివాదాస్పదమయ్యాయి. కానీ పైన ప్రస్తావించిన వారిలో కొందరు టాప్ పొజిషన్‌కు చేరుకోవడంతో వేణుస్వామి పేరు మారుమోగిపోయింది.

అయితే వేణుస్వామి చెప్పే జోస్యం తేడా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌పై ఆయన చెప్పే మాటలు ఎప్పుడూ ఫలించకపోగా, కాంట్రవర్సీకి దారి తీశాయి. తెలంగాణలో కేసీఆర్ , ఏపీలో జగన్, ఐపీఎల్‌లో హైదరాబాద్ గెలుస్తుందన్నారు కానీ ఇవన్నీ తేడా కొట్టడంతో వేణుస్వామిపై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అన్నింటికి మించి శోభిత - నాగచైతన్యల వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
వారిద్దరి జాతకం కలవలేదని ఈ జంట 2027లో విడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పాడు. ఆ మాటలతో అక్కినేని ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది. ఆయనపై పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు కాగా, తెలంగాణ మహిళా కమీషన్ వరకు విషయం వెళ్లింది. వేణుస్వామి చివరికి హైకోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారు. ఈ వివాదం సద్దుమణగక ముందే సీనియర్ జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి తనను డబ్బు కోసం వేధిస్తున్నాడని వేణుస్వామి, ఆయన భార్య వీణ శ్రీవాణిలు సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిరోజుల పాటు ఆయా ఛానెల్స్‌లో ఈ వ్యవహారంపై డిస్కషన్స్ నడవగా.. తర్వాత విషయం సద్దుమణిగింది.
కట్ చేస్తే చాలా రోజుల తర్వాత వేణుస్వామి ఓ సెలబ్రెటీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్‌లో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పుష్ప 2 చూసిన వేణుస్వామి.. అల్లు అర్జున్ జాతకం గురించి జోస్యం చెప్పారు. బన్నీ నటన అద్భుతంగా ఉందని.. ఆయనతో సినిమా తీసిన ఏ నిర్మాత నష్టపోడని, పుష్ప 2 మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని ఆయన తెలిపారు. పుష్ప బ్లాక్‌బస్టర్ నిలుస్తుందని ముందే చెప్పానని.. రాబేయే 15 ఏళ్ల పాటు అల్లు అర్జున్‌కు తిరుగులేదని వేణుస్వామి తెలిపారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అల్లు అర్జున్ అభిమానులు దీనిని తెగ షేర్ చేస్తున్నారు. అయితే సెలబ్రెటీల జాతకం చెప్పనని చెప్పిన వేణుస్వామి మాట తప్పాడని నెటిజన్లు మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











