India Pak War: అట్టర్ ఫ్లాపైన వేణుస్వామి జోస్యం.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు
పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను దారుణంగా ఊచకోత కోసిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 9 ప్రాంతాల్లోని టెర్రర్ క్యాంప్‌లను భారత సైన్యం నేలమట్టం చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ సైతం భారత్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసినా సైన్యం వాటిని గాల్లోనే పేల్చేసింది. ఈ పరిణామాలతో భారత్ - పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం ఆరంభమైనట్లేనని ప్రపంచం ఉలిక్కిపడింది.
భారత్ మహోగ్రరూపం
తొలి రోజు ఉగ్రవాద స్థావరాలపై దాడితో సరిపెట్టిన భారత్.. మనదేశంలోని మిలటరీ స్థావరాలు, ఎయిర్‌బేస్‌లు, పౌర నివాసాలపై పాకిస్తాన్ దాడులు చేయడంతో రగిలిపోయింది. పాక్ ఎయిర్ డిపెన్స్ సిస్టమ్స్, యుద్ధ విమానాలను కూల్చేసింది. ఇండియా జోలికి వస్తే ఇకపై పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. భారత ఉగ్రరూపం దెబ్బకు వణికిపోయిన పాకిస్తాన్ సాయం కోసం అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్ధించినా ఏ దేశమూ దానిని పట్టించుకోలేదు.

అసత్య వార్తలతో రెచ్చిపోయిన పాకిస్తాన్
భారత్‌ను నేరుగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో అసత్య ప్రచారంతో పాకిస్తాన్ చెలరేగిపోయింది. దీనికి భారత సైన్యం ఫ్యాక్ట్ చెక్‌తో అసలు నిజాలను ప్రపంచం ముందు ఉంచింది. ఈ దెబ్బతో ఏం చేయాలో తెలియక యుద్ధాన్ని కొనసాగించే దమ్ము లేక రాజీకి వచ్చింది. గత కొద్దిరోజులుగా రెచ్చిపోయిన పాక్ రాజకీయ నాయకులు, మీడియా సైలెంట్ అయ్యింది. కాల్పుల విరమణకు సిద్ధమంటూ తెల్లజెండా ఎత్తేసింది.
భారత్ - పాక్ యుద్ధంపై వేణుస్వామి జోస్యం
ఇక ట్రెండింగ్ ఇష్యూస్‌పై జోస్యాలు చెబుతూ పాపులర్ అయిన ఆస్ట్రాలజర్ వేణుస్వామి తాజాగా ఇండియా- పాకిస్తాన్ యుద్ధంపైనా వీడియో చేశారు. గత కొద్దినెలలుగా ఆయన చెప్పిన జోస్యాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఆంధ్రా, తెలంగాణ ఎన్నికలు, ప్రభాస్ ఆరోగ్యం ఇలా అన్నింటిలో వేణుస్వామి చెప్పినదానికి రివర్స్‌లో జరుగుతుండటంతో నెటిజన్లు ఆడుకుంటున్నారు.
అమెరికా ఎంట్రీతో భారత్ - పాక్ వార్‌కు బ్రేక్
తాజాగా భారత్ - పాక్ యుద్ధం కారణంగా 80 శాతం నాశనం తప్పదని.. పలువురు ప్రముఖులు మరణిస్తారని వేణుస్వామి జోస్యం చెప్పాడు. మహాభారత యుద్ధ కాలం నాటి పరిస్ధితులు కనిపిస్తున్నాయని ఇది ఏమాత్రం మంచిది కాదని వేణుస్వామి అన్నారు. అయితే వేణుస్వామి వీడియో వదిలిన గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా జోక్యంతో భారత్- పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, రెండు దేశాలకు అభినందనలంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిని భారత్ - పాకిస్తాన్ ప్రభుత్వాలు ధ్రువీకరిస్తూ ప్రకటన చేశాయి.
వేణుస్వామిని ఆడుకుంటున్న నెటిజన్లు
భారత్ - పాక్ యుద్ధానికి, ఉద్రిక్తతలకు బ్రేక్ పడటంతో యుద్ధం ముంచుకొచ్చేస్తుందని జోస్యం చెప్పిన వేణుస్వామిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ దెబ్బతో వేణుస్వామి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ సెక్షన్ డిజేబుల్ చేశారు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి తన జోస్యంపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











