ఆ ఇద్దరు టాప్ హీరోల మధ్య నలిగిపోయాం... నటుడి తమ్ముడు షాకింగ్ కామెంట్స్
చిత్ర పరిశ్రమ సక్సెస్ వెనుక పరుగులు తీస్తుంది. ఎవరు లీడ్‌లో ఉంటే వారి చుట్టూనే జనం. ఇదే సమయంలో హీరోల మధ్య ఆధిపత్య ధోరణి కూడా అత్యంత సహజం. కొందరు దీనిని ఆరోగ్యకరమైన పోటీగా చేస్తే.. మరికొందరు మాత్రం వ్యక్తిగతంగా తీసుకుని పంతాలకు పోతారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలో ఇది కామన్. అయితే హీరోల మధ్య పోటీ, వైరం కారణంగా చిన్నాచితకా నటులు, ఇతరులు నలిగిపోయిన సందర్భాలెన్నో.
తాజాగా ఇద్దరు టాప్ హీరోల మధ్య తాము నలిగిపోయినట్లు ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ సోదరుడు అయ్యప్ప బయటపెట్టారు. సీనియర్ నటుడు పీజే శర్మ కుమారుడిగా, సాయి కుమార్ తమ్ముడిగా అయ్యప్ప అందరికీ సుపరిచితం. తండ్రి, అన్న అడుగుజాడల్లో వెండితెరపై అడుగుపెట్టారు. దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వందలాది చిత్రాలకు పనిచేశారు. అయ్యప్ప దర్శకత్వంలో సాయికుమార్, సౌందర్య నటించిన ఈశ్వర్ అల్లా సినిమాకు ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డ్ దక్కింది. ఈ ఏడాది హరిహర వీరమల్లు, కింగ్డమ్, కూలీ, అఖండ 2, వృషభ వంటి భారీ చిత్రాలలో అయ్యప్ప కీలకపాత్రలు పోషించారు.

సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ శంబాల మూవీతో దాదాపు 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టడంతో వీరి కుటుంబం ప్రస్తుతం సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే అయ్యప్ప పలు ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు టాప్ హీరోల కారణంగా అన్నయ్య బాగా ఇబ్బంది పడినట్లు అయ్యప్ప తెలిపారు. ఈ వివరాల్లోకి వెళితే.. మా నాన్న వచ్చేసరికి ఇండస్ట్రీలో ఓ పది కుటుంబాలు స్థిరపడి.. మార్కెట్‌ను పెంచడంతో పాటు అసోసియేషన్లు, యూనియన్లు అలా ఒక రూపం తీసుకొస్తున్నారు. చిన్నవాడిని కావడంతో అమ్మానాన్నలతో క్లోజ్‌గా ఉండేవాడిని. నాన్నపడే కష్టాలు రోజూ వినేవాడిని అని అయ్యప్ప తెలిపారు.
ఇద్దరు అన్నయ్యలు, నేను డబ్బింగ్‌లో దిగాం. డబ్బింగ్ చెప్పడం అంత తేలికకాదు... కెమెరా ముందు యాక్టింగ్ చేయం అంతే తప్పించి మైక్ ముందు మేమే నటిస్తాం. నేను బాలనటుడిగా తొలుత ఇండస్ట్రీలో అడుగుపెట్టా. 1996లో కన్నడ సినిమా ఆయుధకు దర్శకుడిగా మారాను. డైరెక్షన్ కోసం డబ్బింగ్‌కు కొంత బ్రేక్ ఇచ్చా. 10 సినిమాలు డైరెక్షన్, 40 సినిమాలలో యాక్టింగ్ చేసుంటా. సొంతంగా సినిమాలు తీసి 70 కోట్ల వరకు నష్టపోయాం. వడ్డీలకు, చక్రవడ్డీలు కట్టుకుంటూ ముగ్గురు అన్నదమ్ములం నిలబడ్డా. అప్పులు తీరడానికి పదేళ్లు పట్టింది. మాకు సినిమాలు తప్పించి ఏం తెలియదు. సినిమాలే తీయాలి. డిస్ట్రిబ్యూషన్ చేశా, ఎగ్జిబిటర్‌గా పనిచేశా... అలా ఎక్కడ సినిమాను దాటి బయటకు వెళ్లలేదు. రియల్ ఎస్టేట్ డీలింగ్‌లో కమీషన్ ఇచ్చేందుకు కొందరు ముందుకురాగా.. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య అలాంటివి ఉండొద్దని సున్నితంగా తిరస్కరించా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా మా ముగ్గురు అన్నదమ్ములకు మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు రాలేదని అయ్యప్ప చెప్పారు.
సుమన్‌కి డబ్బింగ్ చెబితే నాకు చెప్పొద్దని రాజశేఖర్ గారు అన్నయ్య గొడవ పడ్డారా? అని యాంకర్ ప్రశ్నించగా.. సుమన్, రాజశేఖర్ గార్లు అప్పుడప్పుడే హీరోలుగా ఎదుగుతున్న సమయం. ఇద్దరికీ అన్నయ్యే డబ్బింగ్ చెప్పేవారు. అన్నయ్య డేట్స్ కూడా నేనే చూసుకునేవాడిని. ఈ మధ్య ఎవరికి వారు బిజీ అయిపోయాం. లేదంటే మొన్నటి వరకు అన్నయ్య డేట్స్ నేనే చూసేవాడిని. రాజశేఖర్‌తో గొడవ అయ్యుంటే మళ్లీ కలిసేవాళ్లం కాదు కదా? నాకే చెప్పు.. నాకే చెప్పు అని సుమన్, రాజశేఖర్‌లతో ఇష్యూలు ఉన్న మాట నిజమే. ఇదే సమయంలో అన్నయ్య కూడా హీరోగా హిట్స్ కొడుతూ బిజీగా ఉంటున్నాడు. ఈ దశలో దాసరి నారాయణరావు గారి సలహా మేరకు అందరికీ ఉన్నపళంగా డబ్బింగ్ ఆపేసి తన కెరీర్ మీద ఫోకస్ చేశాడు. చిన్న చిన్న ఇష్యూలు ఉన్నా తర్వాత ఏరా ఏరా అనుకుంటూ మాట్లాడేసేవాళ్లం అని అయ్యప్ప తెలిపారు.
ఇంత జరిగినా మా అమ్మగారికి ఆరోగ్యం బాలేని టైంలో ఆసుపత్రిలో అడ్మిట్ చేసి కన్నుమూసినట్లు తెలియగానే రాజశేఖర్ గారు ఎంతో బాధపడ్డారు. రాజశేఖర్ హైదరాబాద్‌లో ఉండేవారు.. అమ్మ చెన్నై విజయ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అమ్మకి ఒంట్లో బాగోపోతే చెప్పారా? అని మా మీద సీరియస్ అయ్యారు. ఆ తర్వాత నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్ అయితే రాజశేఖర్ గారే ట్రీట్‌మెంట్ చేశారు అని అయ్యప్ప గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సాయికుమార్ అన్నదమ్ముల కష్టం, గొప్పదనంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











