Sai Rajesh: బేబీ దర్శకుడికి 'బ్రో' గిఫ్ట్.. పవన్ కల్యాణ్ షూ ధర ఎంతో తెలిస్తే?
రౌడీ హీరో తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తనదైన శైలీలో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆనంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బేబీ (Baby 2023). ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ తోపాటు వివాదం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఈసినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కు బేబీ మూవీ నిర్మాత అదిరిపోయే బ్రో గిఫ్ట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు డైరెక్టర్ సాయి రాజేష్.
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బేబీ. ఇందులో ది సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీసుతో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య మరో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే విరాజ్ అశ్విన్ కూడా నటిస్తున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య డీ గ్లామరస్ రోల్ ప్లే చేసింది.

విజయ్ బుల్గాన్ సంగీతం అందించిన బేబీ సినిమాను డైరెక్టర్ మారుతీ, ఎస్‍కేఎన్ (శ్రీనివాస కుమార్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తోన్న బేబీ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. సాయి రాజేష్ ఇదివరకు జాతీయ అవార్డ్ గెలుచుకున్న కలర్ ఫొటో మూవీకి కథ అందించారు.
ఇదిలా ఉంటే తాజా సాయి రాజేష్ కు బేబీ సినిమా నిర్మాత ఎస్‍కేఎన్ అత్యంత ఖరీదైన బహుమతి అందించారు. అది కూడా పవన్ కల్యాణ్ వేసుకున్న షూలను ఆయనకు గిఫ్టుగా అందించారు. పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్ లో పవన్ కల్యాణ్ వేసుకున్న షూ అందరినీ అట్రాక్ట్ చేశాయి. దీంతో ఆ షూస్, వాటి ధర హాట్ టాపిక్ అయ్యాయి.
పవన్ కల్యాణ్ వేసుకున్న షూ బాల్మేయిన్ అనే లగ్జరీ బ్రాండ్ కు చెందినది. ఈ షూస్ ధర 1207 యూరోలు అంటే రూ. లక్ష 6 వేల 870 (రూ. లక్షకుపైగా). ఈ విషయాన్ని తాజాగా డైరెక్టర్ సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "మా ప్రొడ్యూసర్ బ్రో బేబీ సినిమా ఫస్ట్ కాపీ చూశారు. నాకు ఈ బ్రో షూస్ బహుమతిగా ఇచ్చారు. లవ్ యు ఎస్‍కేఎన్. మళ్లీ ఈ రేంజ్ ధరతో షూస్ కొనాలన్న ఆలోచన కూడా భయంగా ఉంది" అని రాసుకొచ్చిన సాయి రాజేష్ ఈ షూస్ ధర లింక్ కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక బేబీ సినిమా జూలై 14న విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











