వారసుడంటే అబ్బాయేనా? అమ్మాయి కాదా? చిరంజీవి కామెంట్స్‌పై నెటిజన్ల ట్రోలింగ్
భారతీయ సమాజంలో నేటికీ ఆడపిల్ల - మగపిల్లాడి మధ్య తల్లిదండ్రులు భేదభావం చూపిస్తూనే ఉన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో పురుషులతో ధీటుగా రాణిస్తూనే ఉన్నప్పటికీ .. వారిని తక్కువ చేసి చూస్తూనే ఉన్నారు. భారతదేశం శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రరాజ్యాలకే సవాల్ విసురుతున్నప్పటికీ.. ఆడ- మగ సమానత్వం విషయంలో మాత్రం నేటికీ ముందడుగు వేయలేకపోవడం దురదృష్టకరం.
తమకు వారసుడు పుట్టే వరకు ఎంత మంది ఆడపిల్లలనైనా కనేందుకు భార్యాభర్తలు సిద్ధంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దీనికి సామాజిక , ఆర్ధిక కారణాలు దోహదం చేస్తూనే ఉన్నాయి. కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే, తమకు వృద్ధాప్యంలో తోడుగా ఉండేది, తమను పున్నామ నరకం నుంచి రక్షించేది కొడుకేనని భారతదేశంలోని అన్ని వర్గాలు, మతాలు, కులాలు బలంగా నమ్ముతాయి.

కానీ కాలం ఎంతో మారింది. వారసుడంటే మగవాళ్లే కానక్కర్లేదని, ఆడపిల్లలు అద్భుతంగా రాణించగలరని ఎన్నో సంఘటనలు నిరూపిస్తున్నాయి. మనదేశానికి ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీ ఉక్కు మహిళగా పండిట్ నెహ్రూకు అసలు సిసలు వారసురాలిగా నిలిచారు. అలాగే ఎన్నో దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా, ఛైర్మన్‌లుగా మహిళలు రాణిస్తూ తమ తాతలు, తండ్రుల ఘన వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు.
ఇదిలాఉండగా .. తెలుగు సినీ వినీలాకాశంలో మెగాస్టార్‌గా, టాలీవుడ్‌కు మకుటం లేని మహారాజుగా దశాబ్ధాలుగా వెలుగొందుతున్నారు చిరంజీవి. స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకుని కోట్లాది మందిని ప్రభావితం చేశారు చిరు. కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించలేనిది ఏది లేదని తన జీవితాన్ని ఒక పాఠంగా మార్చారు. అలాంటి స్పూర్తి ప్రధాత.. వారసత్వం విషయంలో చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీసింది. అయితే ఏ తండ్రికైనా తన కొడుకుకి కూడా వారసుడు పుట్టాలని, తద్వారా తన వంశం నిలబడాలని ఉంటుంది. చిరంజీవి కూడా దీనికి అతీతం కాదు.. తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టారు మెగాస్టార్.
దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ , వెన్నెల కిషోర్ నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. ఇంట్లో మనవరాళ్లతో ఉన్నప్పుడు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా నా పరిస్ధితి ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. చుట్టూ ఆడపిల్లలేనని.. ఈసారి మాత్రం అబ్బాయిని కనరా అని అడిగానని , మన లెగసి కంటిన్యూ అవ్వాలని నా కోరిక అని చిరంజీవి చెప్పారు.

దీనిపై సోషల్ మీడియాలో చిరంజీవిపై ట్రోలింగ్‌కు దిగుతున్నారు నెటిజన్లు . ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని, చిరంజీవి వంటి వ్యక్తి నోటివెంట ఇలాంటి మాటలు సరికాదని చురకలంటిస్తున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి , యాంకర్ శ్యామల కూడా చిరంజీవి వ్యాఖ్యలను ఖండించారు. వారసుడు కొడుకే అవుతాడా.. కూతుర్లు కారా.. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తెలియదని శ్యామల అన్నారు. వారసుడు అనేవాళ్ళు కొడుకు అనే ఉద్దేశ్యంలో నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుందన్నారు.
మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారని.. వారి కోడలు ఉపాసన అన్నీ చక్కగా నడుతున్నారని శ్యామల ప్రశంసించారు. వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కరలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఒక్కరి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతినకూడదని శ్యామల తెలిపారు. ఆయన వ్యాఖ్యల వల్ల కొందరికి కోపం వచ్చింది.. సినిమాను బాయ్‌కాట్ చేస్తామని అంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్రోలింగ్ నేపథ్యంలో చిరంజీవి ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











