Balagam: Group 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. ఏమని అడిగారంటే..
ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు చాలానే ఉన్నా.. అందులో మనసుకు హత్తుకుపోయిన మూవీలు మాత్రం అతి తక్కువ సంఖ్యలోనే వచ్చాయని చెప్పాలి. అందులో తెలంగాణ రాష్ట్రంలోని పల్లె సంస్కృతికి అద్దం పట్టే కథతో వచ్చిన 'బలగం' మూవీ ఒకటి. ప్రియదర్శి - కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జబర్ధస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించాడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే విడుదలైన ఈ మూవీ.. ఆ తర్వాత టాలీవుడ్‌లో సెన్సేషన్‌నే క్రియేట్ చేసిందని చెప్పాలి.
కుటుంబ విలువల గొప్పదనాన్ని వివరిస్తూ తెరకెక్కిన 'బలగం' మూవీని దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించడంతో దీనిపై అందరూ దృష్టి సారించారు. అందుకు అనుగుణంగానే ఆరంభంలోనే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను, రివ్యూలను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీకి ఎవరూ ఊహించని రీతిలో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా నిర్మాతలకు భారీ లాభాలు కూడా సొంతం అయ్యాయి. థియేటర్లలో సత్తా చాటిన 'బలగం'.. ఓటీటీతో పాటు బుల్లితెరపై కూడా హవాను చూపించింది. ఇక, తాజాగా ఈ చిత్రం గ్రూప్ 4 పరీక్షల్లో సైతం హైలైట్ అవడం హాట్ టాపిక్‌గా మారింది.

గత శనివారం తెలంగాణలో గ్రూప్ 4 పరీక్షను నిర్వహించారు. ఇందులో 'బలగం' మూవీపై ప్రశ్న కనిపించడంతో అభ్యర్థులు షాక్ అయ్యారు. అసలు ఇందులో ఏముందంటే.. 'బలగం చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగా జతపరచబడినవి' అని అడిగారు. దీనికి 'A దర్శకుడు- వేణు యెల్దండి, B నిర్మాత- దిల్ రాజు, హర్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డి.. C సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో.. D కొమరయ్య పాత్రను పోషించినవారు - అరుసం మధుసూదన్' అనే ఆప్షన్లు ఇచ్చారు. దీనికి కింద మరో నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.
'బలగం' గురించి అడిగిన ప్రశ్నలో జత చేసిన నాలుగో ఆప్షన్ తప్పుగా ఉంది. వాస్తవానికి ఇందులో కొమరయ్య పాత్రను పోషించింది మధుసూదన్ కాదు. ఆ పాత్రను సుధాకర్ రెడ్డి చేశారు. మరి పరీక్షను రాసిన అభ్యర్థులు ఎలాంటి సమాధానాలు పెట్టారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, ఈ ప్రశ్నకు సంబంధించిన ఫొటోను చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ చిత్రానికి మరో గౌరవం దక్కిందని సంతోషిస్తున్నారు.
ఇక 'బలగం' మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. భీమ్స్ దీనికి సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











