నా పుట్టినరోజు వేడుకలొద్దు.. బాలకృష్ణ బహిరంగ లేఖ.. ఫ్యాన్స్‌కు క్రేజీ గిఫ్టు ఏమిటంటే
నందమూరి నట వారసుడు, నట సింహ బాలకృష్ణ తన 60 పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. జూన్ 10న ఆయన జన్మదినం రోజున తన 60వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. తన అభిమాన నటుడి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలని భారీ ఏర్పాట్లు చేస్తున్న అభిమానులకు వినమ్రతతో రిక్వెస్ట్ చేశారు. కరోనావైరస్ పరిస్థితులు వెంటాడుతున్న సమయంలో, ప్రమాదకరంగా మారిన సమయంలో తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని అభిమానులను బాలకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే..

ఇంటి పండుగగా..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమాన సోదరులందరికీ నా ఆత్మీయ విజప్తి. నా 60వ పుట్టిన రోజును మీ ఇంటి పండగలా కనీవినీ ఎరుగని రీతిలో సంబరాలు చేస్తున్న మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నా హితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులైన మీ అందరితో కలిసి వేడుక చేసుకొనే అదృష్టానికి అంతరాయం ఏర్పడినందుకు బాధగా ఉంది అని బాలకృష్ణ తన ప్రకటనలో తెలిపారు.

మీ క్షేమమే నాకు కొండంత
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత. మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం. ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు, భౌతిక దూరం పాటించడం మనందరి కర్తవ్యం. అందుకే అందర్నీ కలువాలన్న నా ఆకాంక్షకు అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

టీజర్, పాట రిలీజ్ చేస్తున్నాం..
దయచేసి మీ ఆరోగ్యాల్ని నిర్లక్ష్యం చేసి ఎవరూ నన్నుకలువడానికి రావొద్దని కోరుతున్నాను. జూన్ 9వ తేదీ ద్వారక క్రియేషన్స్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రం టీజర్, నేను పాడిన పాట విడుదలవుతున్నాయి. వాటిని ఆస్వాదించండి. ఆశీర్వదించండి అంటూ బాలకృష్ణ తన అభిమానులను కోరారు.

మీ బతుకు.. భవిత ముఖ్యం
ప్రభుత్వ నిబంధనలు పాటించండి. నిండు మనసుతో నా విన్నపాన్ని మన్నించండి. మీ బ్రతుకు ముఖ్యం. మీ భవిత ముఖ్యం. మీ అందరి క్షేమమే మీరు నాకు ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదం. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ మీ బాలకృష్ణ అంటూ తన ప్రకటనను నందమూరి బాలకృష్ణ ముగించారు.


Click it and Unblock the Notifications











