116 రూపాయలపై కాంట్రవర్సీ .. తమన్నాకు ఊహించని షాక్, ఆ మూవీపై ఫిర్యాదు
ఇటీవలి కాలంలో సినిమాలు ఊహించని వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. కథ , మ్యూజిక్ , టైటిల్ కాపీ కొట్టారంటూ కొందరు కోర్టుకెక్కుతున్నారు. ఇక సినిమాలో ఫలానా మతాన్ని, కులాన్ని, వర్గాన్ని కించపరిచారంటూ విరుచుకుపడుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సినిమాలు తీసిన దర్శక నిర్మాతలకు ఈ వివాదాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా తమన్నా భాటియా కీలకపాత్ర పోషించిన ఓదెల 2 కూడా వివాదంలో ఇరుక్కుంది. ఈ వివరాల్లోకి వెళితే..
మధు క్రియేషన్స్ , సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్‌పై సంపత్ నంది, డి మధులు సంయుక్తంగా ఓదెల 2 చిత్రాన్ని దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహాలు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17వ తేదీన ఓదెల 2 విడుదలైంది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఓదెల 2పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కరోనా సమయంలో సైలెంట్‌గా హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్‌లో అమ్మాయిలపై దారుణంగా అత్యాచారం చేసి వారిని కిరాతకంగా చంపుతున్న భర్త తిరుపతిని రాధ తల నరికి చంపుతుంది. ఆ తర్వాత ఆత్మగా మారిన తిరుపతి గ్రామంలో ఏం చేశాడు? అతని వల్ల మళ్లీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? శివశక్తి ఎవరు? తిరుపతి బారి నుంచి గ్రామాన్ని ఆమె ఎలా రక్షించింది? అనే అంశాల చుట్టూ ఓదెల 2ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. ఈ సినిమాపై ఉన్న బజ్ నేపథ్యంలో ఓదెల 2కు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.6 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టి భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఓదెల 2 డిజిటల్ రైట్స్‌ను కళ్లు చెదిరే ధరకు ఓటీటీ దిగ్గజం అమెజాన్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇంతలోనే ఓదెల 2 ఊహించని ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ సినిమాపై బీసీ కమీషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ చిత్రంలోని ఓ వివాహ సన్నివేశంలో గ్రామ సర్పంచ్ 116 రూపాయలు కానుకగా సమర్పించే సమయంలో జరిగే సంభాషణలో పిచ్చగుంట్ల కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు బీసీ కమీషన్ పేర్కొంది. ఈ కులంపై ఉన్న అభ్యంతరకర పదాలను, దృశ్యాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే ప్రాంతీయ సెన్సార్ బోర్డ్‌కు కూడా లేఖ రాసింది. ఈ సినిమాపై పిచ్చగుంట్ల సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తమకు ఫిర్యాదు చేశారని.. దీనిపై ఇప్పటికే అత్తాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందించనుంది? వివాదానికి తెరపడుతుందా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











