Krishnam Raju మరణం వెనుక కారణాలు. వైద్యులు వెల్లడించిన షాకింగ్ విషయాలు ఇవే..
తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజ నటుడు, రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మరణం తీవ్ర విషాదానికి గురిచేసింది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో కృష్ణంరాజు చికిత్స పొందుతూ సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 3.16 గంటలకు తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణం వెనుక కారణాలను ఏఐజీ హస్పిటల్ వర్గాలు వెల్లడించిన విషయాలు ఏమిటంటే?

గత కొద్దినెలలుగా అనారోగ్యంతో
రెబల్ స్టార్ కృష్ణం రాజు గత కొద్ది నెలలుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. ఇటీవల శ్వాస సంబంధిత, ఇతర సమస్యలు తలెత్తడంతో ఆయనను ఆగస్టు 5వ తేదీన ఏఐజీ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటి నుంచి ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు. అయితే పలు అవయవాలు పనిచేయకపోవడంతో కన్నుమూశారు.

పోస్ట్ కోవిడ్ సమస్యలతో
కృష్ణంరాజు మరణంపై ఏఐజీ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు రిపోర్టు ప్రకారం.. ఆయన కోవిడ్ అనంతరం తలెత్తిన సమస్యలతో బాధపడుతున్నారు. గత కొద్దిరోజుల క్రితం రక్త ప్రసరణ జరగకపోవడంతో కాలికి సర్జరీ చేశారు. అప్పటి నుంచి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్య పెరిగిపోవడంతో గుండెపోటుకు గురయ్యారు అని వైద్యులు తెలిపారు.

షుగర్, కిడ్నీ సంబంధిత ఇబ్బందులతో
పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా గుండె కొట్టుకోవడం కష్టంగా మారడంతో హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఆయన షుగర్, కిడ్నీ సంబంధింత వ్యాధులు కూడా ఆయన ఆరోగ్యాన్ని క్షీణించేలా చేశాయి. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతింది. హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం విషమించింది. తాము చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో ఆయన 3.16 గంటలకు కన్నుమూశారు అని వైద్యులు తమ ప్రకటనలో వెల్లడించారు.

హాస్పిటల్‌కు చేరుకొన్న ప్రభాస్, మహేష్
కృష్ణం రాజు మరణవార్త తెలుసుకొన్న వెంటనే ప్రభాస్, మహేష్ బాబు ఏఐజీ హాస్పిటల్‌కు చేరుకొన్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్‌లోనే ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత కృష్ణంరాజు పార్దీవదేహాన్ని నివాసానికి తరలించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కోట్ల స్టేడియానికి తరలింపు?
కృష్ణం రాజు పార్దీవ దేహానికి శ్రద్దాంజలి ఘటించేందుకు భారీగా అభిమానులు, సన్నిహితులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఆయన నివాసం వద్ద స్థలం ఎక్కువగా లేకపోవడంతో.. ఆయన దేహాన్ని మరోచోటికి తరలించాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కృష్ణంరాజు పార్దీవదేహాన్ని ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంటికి ఆయన దేహాన్ని తీసుకొచ్చిన అనంతరం కాసేపు అక్కడే ఉంచి స్టేడియానికి తరలించాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











