Bellamkonda Sreenivas Wedding: తిరుమలలో పెళ్లి... బెల్లంకొండ శ్రీనివాస్ ఎమోషనల్
టాలీవుడ్‌లో ప్రేమ జంటలన్నీ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ - నయనిక రెడ్డిలు పెళ్లి చేసుకున్నారు. తాజాగా నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, హీరో సాయి శ్రీనివాస్ తన ప్రియురాలు కావ్యరెడ్డితో పెళ్లిపీటలెక్కనున్నారు. ఏప్రిల్ 29న తిరుపతి వేదికగా వీరి పెళ్లి జరగనుంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
బెల్లంకొండ సురేష్ వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, భైరవం సినిమాలలో నటించాడు సాయి శ్రీనివాస్. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్‌బస్టర్ మూవీ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు సాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ సినిమాలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ గత కొంతకాలంగా కావ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం తన ప్రియురాలిని పరిచయం చేసిన ఆయన ఏప్రిల్ 8న నిశ్చితార్ధం చేసుకున్నారు. దాంతో వీరి పెళ్లి ఎప్పుడు? డెస్టినేషన్ మ్యారేజా? లేక ఇండియాలోనే చేసుకుంటున్నారా? అంటూ చర్చ నడిచింది. అయితే ఏప్రిల్ 29న తిరుపతి వేదికగా కావ్యరెడ్డి - సాయి శ్రీనివాస్‌ల పెళ్లికి పెద్దలు నిశ్చయించారు.
ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను బెల్లంకొండ కుటుంబం ఆహ్వానించింది. ఇవాళ రాత్రి 11.13 నిమిషాలకు తిరుమల శ్రీవారి సన్నిధిలో బెల్లంకొండ శ్రీనివాస్- కావ్యరెడ్డిల వివాహం జరగనుంది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. అయితే సినీ, రాజకీయ, ఇతర ప్రముఖుల కోసం మే 1న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఇక కావ్య రెడ్డి విషయానికి వస్తే... ఆమెకు సినీరంగంతో ఎలాంటి సంబంధం లేదని .. ఆమె కుటుంబం న్యాయవాద రంగానికి చెందినదిగా వార్తలు వస్తున్నాయి. కావ్య కుటుంబానిది హైదరాబాదేనని, ఆమె తండ్రి లాయర్ కాగా.. తాతగారు జడ్జిగా సేవలు అందిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. బెల్లంకొండ- కావ్య రెడ్డి కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఫిలింనగర్ టాక్.
పెళ్లి సందర్భంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఎమోషనల్ అయ్యారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు నాకు చాలా మెమొరబుల్ డే అవ్వబోతోంది. నాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు వెంకటేశ్వరస్వామి. మా అమ్మానాన్న కూడా నా పేరు శ్రీనివాస్ అని పెట్టారు. ఆ పేరుకు కరెక్ట్‌గా జస్టిఫికేషన్ లాగా శ్రీనివాస కళ్యాణం.. చిన్నప్పటి నుంచి తిరుమలలో చూడటం జరిగింది. నాకు కళ్యాణం అంటే శ్రీనివాస కళ్యాణమే. అలానే అనుకోకుండానే నా ఫియాన్సే నా జీవితంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస కావ్యరామ్ అని పేరు పెట్టడం జరిగింది. అనుకోకుండా తిరుమలలో పెళ్లి చేసుకోవాలని అనిపించింది. ఇక్కడ పెళ్లి చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు.. అదృష్టం ఉండాలి, ఆయన ఆశీస్సులు ఉండాలి. అంత అదృష్టం నాకు దొరకడంతో నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. ఈరోజు ఆయన కాళ్ల కింద నా పెళ్లి జరగడం అనేది నాకు చాలా ఆనందమైన విషయం. ఎప్పుడెప్పుడు వెళ్లి పెళ్లి చేసుకుంటానా అని వెయిట్ చేస్తున్నాను అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు.


Click it and Unblock the Notifications