బిగ్ బాస్ నటిపై పోలీస్ కేసు.. ప్రేమ,పెళ్లి పేరుతో కోట్లు కాజేసిందంటూ..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అషు రెడ్డి (Ashu Reddy) పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో గ్లామర్ పోస్టులు, రియాలిటీ షోలు, బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం సినీ ప్రాజెక్ట్ గానీ, సోషల్ మీడియా పోస్టులు గానీ కాదు.. నేరుగా పోలీస్ కేసు. ప్రేమ, పెళ్లి పేరుతో కోట్ల రూపాయలు మోసం చేశారంటూ ఆమెపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్రకు 2018లో అషు రెడ్డి తో పరిచయం ఏర్పడింది. భారత్‌కు వచ్చిన సమయంలో ఈ పరిచయం మొదలైందని తెలుస్తోంది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసుకుని, సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చానని చెప్పి అతనితో సన్నిహితంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే ఆ పరిచయం ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ధర్మేంద్రను విశ్వసింపజేసిందని బాధితుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ప్రేమ పేరుతో దగ్గరైన తర్వాత ఆర్థిక అవసరాలు ఉన్నాయని చెప్పి పలుమార్లు డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మేంద్ర నుంచి తీసుకున్న మొత్తాలతో కారు, బంగారం, ఫ్లాట్లు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసి వాటిని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇక పెళ్లి విషయం ఖరారు చేస్తున్నామంటూ కుటుంబ సభ్యులు ముందుకొచ్చి పూజలు, శుభకార్యాల ఏర్పాట్లు చేసినట్లు కూడా ఫిర్యాదులో ఉందని సమాచారం. కానీ తర్వాత మాట తప్పి, పెళ్లిని వాయిదా వేస్తూ చివరికి నిరాకరించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
బాధితుడి తండ్రి యెనుముల సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2018 నుంచి 2025 వరకు నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాల రూపంలో మొత్తం రూ.9.35 కోట్ల మేర ఆస్తులు, డబ్బులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదనంగా ఆమె సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల ఆధారంగా హైదరాబాద్ CCS పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ రికార్డులు, ఆస్తుల కొనుగోలు వివరాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అషు రెడ్డి పేరు గతంలో కూడా పలు వివాదాల్లో వినిపించింది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినప్పుడు, అందులో ఆమె పేరు కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ సమయంలో డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభించి కూడా వార్తల్లో నిలిచారు. నెలకు చార్జ్ తీసుకుని ప్రత్యేక కంటెంట్ అందిస్తానని ప్రకటించడంతో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా ప్రేమ, పెళ్లి పేరుతో మోసం కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications