Ashu Reddy: 9.5 కోట్ల రూపాయల వివాదంలో ట్విస్ట్.. ఎంగేజ్‌మెంట్‌తో షాకిచ్చిన అషురెడ్డి
పెళ్లి పేరుతో తనను 9.5 కోట్ల రూపాయల మేర మోసం చేసిందంటూ సినీ నటి అషురెడ్డిపై ఓ ఎన్ఆర్ఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఫిర్యాదు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. చివరికి విషయం కోర్టు వరకు వెళ్లింది. ఈ వివాదం నడుస్తుండగానే అషురెడ్డి ఊహించని షాకిచ్చింది. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

బిగ్‌బాస్‌తో పాపులర్
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అశ్విని రెడ్డి అలియాస్ అషురెడ్డి స్వస్థలం విశాఖపట్నం. టిక్ టాక్, డబ్‌స్మాష్ వీడియోలతో యువతలో పాపులర్ అయ్యింది. ఈ దశలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది. బిగ్‌బాస్‌తో మరింత క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొన్ని సినిమాలలో చిన్నాచితకా పాత్రలు చేసింది. ఈ దశలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమెకు పాపులారిటీతో పాటు విమర్శలు తెచ్చిపెట్టింది. అనంతరం అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తోంది అషురెడ్డి.
అషురెడ్డిపై ఎన్ఆర్ఐ ఆరోపణలు
అయితే కొద్దిరోజుల క్రితం ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐ ఇంజనీర్, అతని తండ్రి సత్యనారాయణలు అషురెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో అషురెడ్డి తన కొడుకుని మోసం చేసిందని ఏకంగా 9.5 కోట్ల రూపాయలు తీసుకుందని సత్యనారాయణ హైదరాబాద్‌లోని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం తెలుగునాట సంచలనం సృష్టించింది. తనపై వచ్చిన ఆరోపణలపై అషురెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నిరాధరమైన కథనాలు ప్రసారం చేస్తే లీగల్‌గా చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది.
కోర్టులో అషురెడ్డికి చుక్కెదురు
అటు అషురెడ్డి తండ్రి వెంకట కృష్ణారెడ్డి సైతం తన కుమార్తె అమాయకురాలని, తనకు ఏం తెలియదని వెల్లడించారు. ధర్మేంద్రతో పెళ్లి ప్రతిపాదనను తాము గతంలోనే తిరస్కరించామని అయినప్పటికీ తన కుమార్తెతో అతను టచ్‌లోనే ఉన్నాడని పేర్కొన్నారు. మరోవైపు.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో అషురెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. దర్యాప్తుపై స్టే విధించడానికి నిరాకరించింది. తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అషురెడ్డి ఆడియో లీక్
ఇదే సమయంలో అషు మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ ఆడియో టేప్ బయటకు రావడం కలకలం రేపింది. అందులో తనకు మే వరకు టైమ్ ఇస్తే 1.50 కోట్ల రూపాయలు ఇస్తానని.. మిగిలిన డబ్బుని నేను స్థిరపడిన తర్వాత ఇస్తానని రాజీ పడేందుకు అషురెడ్డి ముందుకొచ్చినట్లుగా ఉంది. ఈ వివాదం కొనసాగుతుండగానే.. అషురెడ్డి షాకిచ్చింది. సైలెంట్‌గా నిశ్చితార్ధం చేసుకుంది. కాబోయే భర్త చేతిలో చేయ్యేసి.. ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించే విధంగా ఫోటోలు షేర్ చేసింది. అయితే అషురెడ్డికి కాబోయే భర్త ఎవరు? అనేది మాత్రం ఆమె రివీల్ చేయలేదు. మరి దీనిపై ధర్మేంద్ర, అతని కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications


