‘మహేశ్ బాబు, ప్రభాస్ తర్వాత నేనే... టాలీవుడ్‌లో అలా తొక్కేశారు’
హేమాహేమీలున్న సినీ పరిశ్రమలో సామాన్యులు నెగ్గుకు రావడం కష్టం. ఎవరో ఒకరిద్దరు తప్పించి.. గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో కష్టమని ఎంతోమంది స్టార్స్ బహిరంగంగానే అంగీకరించారు. ఎంతోమంది ప్రతిభావంతులు నెపోటిజం బారినపడి అడ్రస్ లేకుండా పోయారు. బాలీవుడ్‌లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితమే ఇందుకు పెద్ద ఉదాహరణ. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఇలాంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు.
నటన విషయంలో తమ వారసుల కంటే స్మార్ట్‌గా ఉండటంతో పాటు అందం, రూపం, ఫిజిక్ విషయంలో మెరుగ్గా ఉన్నా యంగ్ హీరోలు ఎన్నో ఇబ్బందులు పడతారని బిగ్‌బాస్ ఫేమ్ సామ్రాట్ రెడ్డి తెలిపారు. దాదాపు 20 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరో ఫ్రెండ్‌తో పాటు ఇతర సహాయక పాత్రలు చేస్తూ కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న దశలో పరిశ్రమకు అనూహ్యంగా దూరమయ్యారు సామ్రాట్ రెడ్డి. తిరిగి బిగ్‌బాస్‌తో తన సత్తా నిరూపించుకుని తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, జీవితంలో తగిలిన ఇబ్బందులు, టాలీవుడ్‌లో నెపోటిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు సామ్రాట్ రెడ్డి. ఈ వివరాల్లోకి వెళితే..

ఏదో వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తానని కాకుండా నాకంటూ మంచి గుర్తింపు ఉంది. నాది మరిచిపోయే ఫేస్ కాదు.. ఇంత గ్యాప్ వచ్చినా ఇప్పటికీ చాలామంది గుర్తుపడుతూ ఉంటారు. సినిమాలు ఎందుకు చేయడం లేదు? ఎందుకు ఆపేశారు? అడుగుతూ ఉంటారు. డాడీకి హెల్త్ బాగోకపోవడంతో బిజినెస్ సైడ్ వెళ్లాననని చెప్పేవాడిని. ఇండస్ట్రీలో రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. నాకెప్పుడు అలాంటి పరిస్ధితి ఎదురుకాలేదు. ప్రతి నటుడికి, దర్శకుడికి నా గురించి తెలుసు. కులం విషయంగా నన్నెవరూ దూరం పెట్టలేదు. కాకపోతే ముందు ఇచ్చిన క్యారెక్టర్ కొన్నిసార్లు ఛేంజ్ చేయడం జరిగింది. దర్శకులకు నా ఆడిషన్ నచ్చి, కాస్ట్యూమ్స్ కూడా ఓకే అయిన ఫ్రేమ్ పెట్టాక హీరోలనే డామినేట్ చేసేవాడిని. అలా మూడు నాలుగు సినిమాలు పోయాయి అని సామ్రాట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అవసరమైతే ముఖానికి రంగు వేసుకుంటానని కూడా చెప్పా. కానీ హైట్‌ని మాత్రం తగ్గించలేం కదా? అమితాబ్ బచ్చన్‌ని ఆరడుగుల అందగాడు అంటారు. కానీ కొన్ని విషయాల్లో క్లిక్ కాకపోతే ఎవరినైనా పక్కనపెట్టేస్తారు. నేను ఇండస్ట్రీకి వచ్చే టైంకి మహేశ్, ప్రభాస్ గారు మాత్రమే ఆరడుగులు ఉండేవారు. ఆ తర్వాత నేనే. మహేశ్, ప్రభాస్‌లకు నేను పెద్ద అభిమానిని. చిన్నప్పటి నుంచి నాన్నగారితో షూటింగ్‌కి వెళ్లేవాడిని... ఆ పరిస్దితులు చూసి నా జీవితం గురించి, నటన గురించి పెద్ద కలలు కనేవాడిని. అయితే పంచాక్షరి మూవీ నా కెరీర్‌లో పెద్ద ఆఫర్. అనుష్క గారి లాంటి స్టార్‌తో నటించడం నా అదృష్టం. అనుష్క భర్తగా మంచి ప్రశంసలు దక్కినా... నా లైఫ్‌లో హిట్ అనే పదం పడలేదు అని సామ్రాట్ రెడ్డి తెలిపారు.
కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ హిట్ అయినా నా పాత్ర పరిధి చాలా తక్కువ. షూటింగ్ టైంలో నా మీద చాలా సన్నివేశాలు తీశారు. కానీ ఎడిట్ టేబుల్ మీదకి వెళ్లేసరికి పాత్రను ట్రీమ్ చేశారు. ఏ సీన్ ఉంచాలి? ఏ సీన్ తీసేయాలి అనేది వాళ్ల ఇష్టం. కాకపోతే హిట్ అయిన మూవీలో తక్కువ క్యారెక్టర్ పడిందని బాధ. అనుష్క గారి లాంటి మంచి మనిషిని జీవితంలో చూడలేదు. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా... ఒదిగే ఉంటారు. నేను పెద్ద హీరోయిన్‌ని నువ్వెంత అనేలా ఎప్పుడూ ఆమె ప్రవర్తించలేదు. ఎవరు పెట్టారో కానీ స్వీటి అని కరెక్ట్ పేరు పెట్టారని సామ్రాట్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సామ్రాట్ రెడ్డికి అవకాశాలు లేకుండా చేసింది ఎవరు? చివరి నిమిషంలో పాత్రలను మార్చిందెవరు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











